హరేక్ మాల్ బీస్ రుపే


Sun,December 23, 2018 11:00 PM

అతడు నాకు బాల్యం నుండీ చిరపరచితుడు
విలక్షణమైన స్వర విన్యాసంతో
ఆత్మీయమైన కళ్ళ వెన్నెలతో
నన్ను చిన్నప్పుడే ఆకర్షించినవాడు
అతనప్పుడు పాత డొక్కు సైకిల్ నిండా వస్తుహారాలతో
పాతనగర వీధులన్నీ కలియ తిరిగేవాడు
అతని మెడనిండా, భుజాలనిండా రకరకాల వస్తువులు
హరేక్ మాల్ చారాణా.. అన్న గొంతు వినగానే
పొలోమని మేమంతా అతని చుట్టూ మూగేవాళ్ళం
దువ్వెనలు, అద్దాలు, పిన్నీసులు, కత్తెరలు, నేల్ కట్టర్లు,
స్నోలు, పౌడర్లు, సబ్బులు... ఒక్కటేమిటి
ప్రతివస్తువుకూ ఫిక్స్‌డ్ రేట్ ఇరవైఐదుపైసలే
అన్నీ హైదరాబాద్ లోకల్ మేడ్ (మేడిన్ హైదరాబాద్)
సగటు మనిషి అవసరాలు తీర్చే
సంచార కిరాణాకొట్టులాగా ఉండేవాడు
వీధి వీధంతా కలియ తిరిగి అతను వెళ్లిపోగానే
వాన కురిసి వెలిసినట్లుండేది
నుదుట బొట్టుకానీ..నెత్తినటోపీ, పగిడీలు కానీ లేనందున
అతడచ్చు పదార్థవాదిలా కనబడేవాడు
అతడంటే నాకు గ్లామర్.. ఒక స్ట్రీట్ వీరుడు..!
నా కౌమారంలో అతని నినాదం మారింది
హరేక్ మాల్ దో రుపే
అతనప్పుడు పాత మోటార్‌బైక్ నిండా వేళాడే
వస్తు ప్రదర్శన శాలగా రూపాంతరం చెందాడు
అప్పుడతని చుట్టూ మేం మూగకపోయినా
అతని నాదస్వర తరంగాలు మా చెవుల్లో మార్మ్రోగుతూ ఉండేవి
అతనప్పుడు నడుస్తున్న సూపర్‌బజార్‌లా కనబడేవాడు
చాన్నాళ్లకు...
మొన్న ఒక పాత మారుతీట్రాలీ నిండా వస్తు సంపదతో
హరేక్ మాల్ బీస్ రుపే అంటూ ప్రత్యక్షమయ్యాడు
ఎన్ని సూపర్ బజార్లు, స్పెన్సర్లు,
మల్టీప్లెక్స్‌లూ, వాల్ మార్ట్ లొచ్చినా అతడుంటాడు
ఈ పవిత్ర భారతదేశంలో పేదరికం కొనసాగినంతకాలం
అతడొక కామధేనువులా, కల్పవృక్షంలా...
హరేక్‌మాల్... నినాదంతో
సగటు మనిషికి ఆసరాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాడు.
- డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, 96180 32390

389
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles