
కళ్ళుంటాయి.. కాని వాటికి చూపుండదు
కనబడదు ఏదీ.. కాని వాడు గుడ్డివాడని ఎవరికీ తెలియదు
చెరువులు కనబడవు.. నదులు కనబడవు..నవ్వులు కనబడవు
వెలుగులూ కనబడవు
ఆలోచనలెప్పుడూ కుర్చీ చుట్టే తిరుగుతూంటాయి
తలలనిండా కుట్రలతో
కుక్కా, పిల్లీ, మేకా, పులీ.. అన్నీ ఫెవికాల్ పూసుకుని జట్టుకడ్తాయి
దేని కూతా, దేని అరుపూ దానిదే
శృతిలేని మేళంలో ఎవడి చిందులు వాడివే
ఉచిత బఫూన్ చేష్టలతో అంతా వినోద కదంబం
రాత్రుళ్లుమాత్రం ఎవని గుహలో వాడు
ఒకని తోకను మరొకడు కత్తిరించే వ్యూహాల్లో బిజీ -
పచ్చ కామెర్ల కళ్ళతో వీక్షిస్తున్నపుడు
అక్కుపచ్చని పొలాలు.. ఎర్రగా
తెల్లని నీళ్ళు.. నల్లగా
ప్రజలందరూ ఒట్టి గొర్రెలుగా కనబడ్తూంటారు
ప్రతి మనిషీ ఒక ఓటుగా
అమ్ముడు సరుకుగా.. ఒక నోటుగా అగుపిస్తాడు
విప్లవకారులు పాటలను బూర్జువాల పాదాల దగ్గర తాకట్టుపెట్టి
బఫూన్ల కాళ్ళదగ్గర మొరుగుతూ మోకరిల్లుతారు
ఎవడికి ఏం కావాలో వాడికే తెలియదు
చంపినోడితో స్నేహిస్తూ.. స్నేహితుణ్నే చంపేస్తూ
ఒక నీతిహీన, రీతిహీన రాక్షస కృత్యాలతో వికృత ఒప్పందాలే అన్నీ
కుక్క సింహంలా గర్జిస్తూంటే వినేవాళ్ళకు వాంతులౌతాయి
ఎప్పుడూ కనబడని వింత జంతువులు కొన్ని
విచిత్ర విన్యాసాలతో విరుచుకు పడ్తూంటే
ఎన్నడూ తెలియని అసహ్యమేదో మునిసిపల్ మోరీలా ఆవరిస్తుంది
వాడు మేధావని ఇనాళ్ళూ పడ్డ భ్రమ
స్మశాన కపాలంలా బ్రద్దలై.. అంతా భ్రష్టత విస్ఫోటిస్తుంది
అసలు ఈ తెలంగాణ నేల మొదటినుండీ
ఇంటి దొంగలతో, కోవర్ట్లతో, వెన్నుపోటుదార్లతో
మూతులనూ, చేతులనూ కుట్టుకున్న బావిసలతోనే కదా
తల్లడిల్లుతున్నది.. గాయపడ్తున్నది...
ఐతే ఇంటిదొంగలెప్పుడూ గెలువలేదు చరిత్రలో
తనే ఒక చరిత్రైన సింహం గడ్డి తినదు
అది లేచి గర్జిస్తున్నపుడు అడవి గడగడలాడి లొంగిపోతుంది
రణమో.. మరణమో.. వీరునికి రెండే లక్ష్యాలు.. అంతే...
- రామా చంద్రమౌళి, 9390109993