ప్రపంచ కవిత


Mon,December 17, 2018 01:33 AM

Nelly-Sachs
-నెల్లీ సాక్స్ (1891 డిసెంబర్ 10-1970 మే12 )
జర్మన్ రాజధాని బెర్లిన్ నగరంలో సంపన్న యూదు కుటుంబంలో జన్మించిన లియోనీ నెల్లీ సాక్స్ అంతర్జాతీయంగా పేరు పొందిన కవయిత్రి, అనువాదకురాలు! రెండో ప్రపంచయుద్ధ కాలంలో నాజీల దురాగతాలకు,అమానుష హత్యాకాండకు భయపడి, 1940లో పారిపోయి స్వీడన్‌లో తలదాచుకుంది. అక్కడే స్వీడన్ భాషను నేర్చుకుని అక్కడి ప్రముఖ కవుల కవిత్వాన్ని అనువాదం చేసింది. అత్యంత ఆలస్యంగా తన 56 వ యేట In The Houses of Death (1947)తో తొలి కవితా సంకలనాన్ని ప్రచురించింది.ఆ తర్వాత Eclipse of Stars (1949), And No One Knows Where To Go (1957), Flight and Metamorphosis (1959) వంటి కావ్యాలతో ప్రపంచవ్యాప్త కీర్తిని సంపాదించింది.
తన అక్షరాలలో యూదుల జీవనశైలిని,వారి ప్రవాసాన్ని, దుఃఖాన్ని, మృత్యు విధ్వంసాన్ని, యుద్ధ బీభత్సాన్ని మార్మికంగానూ, తాత్వికంగానూ చిత్రించింది. తాను చూసిన జీవనానుభవాలను ఆలంబనగా చేసుకుని విశ్వజనీన దృక్పథంతో మానవ జీవనంలోని విషాదాన్ని, నిరాశను, స్వేచ్ఛా రాహిత్యాన్ని, నిత్య శంకిత సమాజాన్ని, నిరంతర శృంఖలాబద్ధమైన ఆలోచనలను, వాటి చుట్టూ అల్లుకున్న నిర్లిప్త,నిర్జీవ భావాలని, ఆశావహ స్పందనలని తన ప్రతీ కవితలో ప్రత్యక్షం చేయించింది. వ్యక్తిగతంగా నిరంతర అంతర్ముఖురాలై జీవితాంతం ఏకాంతంగా అవివాహితగానే గడిపింది. ఆమె సాహితీ సృజనకు 1966 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ సాహిత్య బహుమతి పట్టం కట్టింది.

మట్టి నుంచి వచ్చేదెవరైనా !

భూమి నుంచి వచ్చేది ఎవరైనా
వారి అంతిమ గమ్యం
చంద్రున్ని చేరటమే..
లేదా
స్వర్గలోకపు లోహ పుష్పాన్ని అందుకోవటమే!

ప్రగాఢ కాంక్ష ఓ నిద్రాణ మందుగుండు సామాగ్రి
అనూహ్యంగా ఒక్కసారి పేలుతుంది
జ్ఞాపకాల విస్ఫొటనంలో గాయపడ్డ బంధాలు
చెల్లా చెదురై గాలిలో కలుస్తాయి!

భూమికి ఆవల రాత్రిని పులుముకున్న కాలం
నిత్య వినాశనంలోంచి ఎగసిన నయనం
అంతర్దారులను వెదుకుతూ
రెక్కలు తొడుక్కున్న ప్రార్థనలై ఎగిరి వెళ్లిపోతాయి!

మహాబిలాలు.. నిర్జల సముద్రాలు
అశ్రువులతో నిండిపోయి
ధూళి నుండి.. బూడిద కుప్పల నుండి తప్పించుకుంటూ
నక్షత్ర మజిలీల వెంట పయనిస్తుంటాయి!

ప్రతీ చోటా భూమి
బెంగటిల్లిన ఆత్మలకు ఆవాసాలను కడుతుంది
దిగులు నిండిన దేహాలకు శిబిరాలను నిర్మిస్తుంది!

ఇక ఇప్పుడు
నేల మీద కాలూనటానికి చోటులేదు
అలవాటైన రక్త సముద్రాల మీద
అలుపు తీర్చుకోడానికి మాటు లేదు!

జాజ్వల్యమానమైన సంగీతపు అంచుమీద
ప్రకాశవంతంగా పొంగుతున్న స్వరాల వరద మీద
ఒడుపుగా తేలుతూ వెళ్లడమే..
అమర్త్య సంకేతపు లయానుగుణంగా
చాకచక్యంగా నడుస్తూ వెళ్లడమే..

ఇది జీవితం... ఇదే మరణం!
ఇది యే శవం... ఇదే జీవం !!

మూలం: నెల్లీ సాక్స్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ,8008005231

2618
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles