ఇది మా చెరువు కాదు


Mon,December 17, 2018 01:31 AM

నన్ను చూస్తే మా ఊరి చెరువు
నిక్కరు విప్పి గెంతులేసేది
నాకు తెలుసు తనతో పాటు
తనలో ఆటలాడుకుందాం రమ్మని ఆ కవ్వింపు-

ఇప్పుడు మా చెరువులో గేదెలు
ఈత నేర్చుకుంటున్నాయి
సగం దేహాన్ని నీళ్ళలో ముంచి
సగం దేహాన్ని ఆకాశానికి రుద్దుకుంటూ
మోరెత్తి మరీ గీరగా చూస్తున్నాయి

చెరువు చూస్తే ఇది మా ఊరే అనిపించింది
చెరువులో పశువుల్ని చూస్తే..
కాసేపు కాదేమో అనిపించింది
అవును మరి ఒకప్పుడు
పెద్దపెద్ద తామరాకుల మీద సూర్యుడు
తూరుపు నుంచి పడర దాకా
ఎర్రని ఎండ జుట్టు ఎగరేసుకుంటూ నడిచేవాడు
చెరువులో క్రిక్కిరిసిన తెల్లతామర పూల సాక్షిగా
ఊరు ఊరంతా సూర్య నమస్కారం చేసేది

నేనే దారి తప్పానో ..
మా ఊరే దారి తప్పిందో.. కొంచెం తికమక
పెద్ద గుడి కోటగుమ్మం అలాగే వుంది
శివాలయం ధ్వజస్తంభం అలాగే వుంది
తీర్థానికి దేవుడు ఊరేగే రథమూ పొన్న వాహనమూ
అన్నీ అలాగే వున్నాయి
కల్లాకపటం ఎరుగని చెరువే చెల్లాచెదురైంది

దోసిట్లోకి నీళ్ళు తీసుకుంటే
ఎగిరే పక్షులు కూడా కాసేపు ఆగి
మొహాలు చూసుకుని
రెక్కలు దువ్వుకుని మురుసుకునేవి
రాత్రంతా ఏ దేవతలో వచ్చి
మా చెరువును కొబ్బరి నీళ్ళతో నింపి
పోతారనుకునే వాళ్ళం
ఇప్పుడు ముదురు ముదురు పసరు మొహానికి పూసుకుని పళ్ళికిలిస్తోంది

ఇది మా ఊరే కాని ముమ్మాటికీ ఇది మా చెరువు కాదు
ఏ ప్లాస్టిక్ దేహల్లోనో తాను అయిష్టంగా కూర్చుని
ఏ అంగట్లో అమ్మకానికి నిలబడిందో!

పచ్చదనాన్ని ఊడ్చి పారేయడానికి
రొయ్యలూ చేపలూ కొత్త పారలు మోసుకొచ్చాయి
అవి విదిలించే నోట్లు మనుషులకూ
అవి విసర్జించే మలినాలు
మా ఊరి చెరువుకు బట్వాడా అవుతుంటే
నాకంతా తారుమారుగా వుంది

ఎంతైనా ఈ నీరు తాగే ఇంతవాడినయ్యాను
అరే బాబూ ముక్కు మూసుకోని నడవరా అని
మా చెరువు హెచ్చరిస్తుంటే
ఒంట్లో ప్రవహిస్తున్న మా చెరువు నీళ్ళు
పైకి తన్నుకొచ్చి కళ్ళు మూసుకున్నాను

ఇంతకీ ఊరికి చిరునామాలాంటి తనను
విష రసాయనాల రిజర్వాయరుగా మార్చిన పాపానికి
శాపం ఏ రూపంలో తగులుతుందో ఆరా తీసే తీరుబడి
ఇక్కడెవరికీ లేదని చెరువు నా చెవిలో ఊదింది.. ...

-ప్రసాదమూర్తి,8499866699

758
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles