
ఈ యాత్ర చాలాకాలం సాగేట్టుంది
కాగితప్పడవ మీద ప్రయాణం కదా
అక్షరాల తెరచాప ఆసరాతో
నడుస్తున్న నడక
చేరాల్సిన గమ్యం దూరమే
మార్గమూ కఠినమే
ఆత్మను అరచేతిలో పొదువుకుని
ఒంటరి లోకాన్ని దాటుకుంటూ
క్లిష్టమైన మబ్బుల్నీ సరళమైన వెన్నెలనీ
సన్నిహితంగా పొదువుకుని
నడక సాగుతున్నది
మూతలు పడుతున్న కళ్ళతో
కన్నీటి ధారల్ని వెంటేసుకుని
అనేకానేక గ్రహాల్ని దాటుకుంటూ
నక్షత్ర తీరం వైపు సాగుతున్న ఈ యాత్ర అనంతమేమో
భావాల అలల మీద కాలం నిలుస్తుందా
పడవ తీరం చేరుతుందా
ఇది నా ఒక్కడి ప్రయాణమేనా ఏమో..
- వారాల ఆనంద్, 94405 01281