అన్నా అక్మతోవా


Mon,December 10, 2018 12:51 AM

(1889, జూన్ 23-1966, మార్చి 5)
anna-akhmatova
ఉక్రెయిన్ దేశంలోని ఒడెస్సా పట్టణంలోని సంపన్న కుటుంబంలో జన్మించిన అన్నా గోరెంకోకు సాహిత్యం, రచన అంటే విపరీతమైన ప్రేమ. అయితే ఆమె తండ్రి మాత్రం ఆమె ఆసక్తిని నిరుత్సాహపరుచడమే కాక, తమ కుటుంబ పరువును భ్రష్టుపట్టించవద్దని చెప్పడంతో, చివరికి తన అమ్మమ్మ పేరు అన్నా ఆండ్రియేవ్నా అక్మతోవాను కలం పేరుగా పెట్టుకొని కవిత్వం రాసింది. 1912లో తన తొలి కావ్యం Eveningతో రష్యన్ సాహితీవేత్తలందరి దృష్టిని ఆకర్షించి, ఆ తర్వాత Rosary (1914) కావ్యంతో సాహితీ ప్రపంచంలో ACMEISM (కవిత్వంలో మితిమీరిన ప్రతీక వాదాన్ని తిరస్కరించి వచనంలో స్పష్టత ముఖ్యమని ప్రచారం చేసిన) ఉద్యమాన్ని తీసుకొచ్చి, అప్పటి బోల్షెవిక్ ప్రభుత్వం చేత 1925-40 వరకు నిషేధానికి గురైంది. ప్రఖ్యాత రచయిత పుష్కిన్ రచనలను ఎన్నింటినో అనువాదం చేసిన ఆమె, స్టాలిన్ కాలపు అణిచివేత, అరాచకాలను వ్యతిరేకిస్తూ ధిక్కార నాదాన్ని వినిపించింది. స్టాలిన్ బాధితుల స్మృతిలో Requiem దీర్ఘకవితను, ఆ కాలంలో భయోత్పా తాన్ని Anno Domini MCMXXI (1922), Poem Without A Hero పేరుతో కావ్యాలుగా వెలువరించి, బతికినంతకాలం తన రచనలపైన సెన్సార్‌షిప్‌ను చవిచూసింది. ఆఖరికి ప్రభుత్వం తన కొడుకును జైలు పాలు చేసినా ధైర్యంగా పోరాడింది.

తన జీవితంలో మొత్తం మూడుసార్లు వివాహం చేసుకున్న ఆమె, ప్రఖ్యాత రచయిత బోరిస్ పాస్టర్ నాక్‌కు అభిమాన కవయిత్రిగా పేరొందింది. సామాన్య రష్యన్ ప్రజల పక్షాన నిలిచి వారి మనోభావాలను స్పష్టంగా అక్షరీకరించిన ఆమె.. కవిగా, అనువాదకురాలిగా, సాహితీ విమర్శకురాలిగా, ఉద్యమకారిణిగా రష్యన్ ప్రజలు అమితంగా ఆరాధించే వ్యక్తిగా తిరుగులేని స్థానాన్ని సాధించింది.

సాయంకాలాన..!

ఎంతో పరిచయం ఉన్న తోటనే ఇది
కానీ ఈ రోజు
ఈ తోట అవ్యక్త నిరాశతో కూర్చిన
ఓ కొత్త సంగీతాన్ని ఆలపిస్తుంది
మంచు ముక్కల మీద పేర్చిన
ఆల్చిప్పల కూర
తాజాగా.. సూటిగా..
సముద్ర వాసన మోసుకు వస్తూంది!
అతను.. నేను విశ్వసనీయ నేస్తాన్ని అంటూ
నా వస్ర్తాలని సున్నితంగా స్పృశించాడు
ఆ రెండు హస్తాల స్పర్శ
ఆలింగనం కన్నా ఎంత భిన్నంగా ఉందీ?
ఆ విధంగా అది అతను పిల్లినో, పిట్టనో పడగొట్టేసే తీరు అది
అంతే మోహనంగా అతను
సన్నని నాజూకు స్త్రీ అశ్వీకుల వంక
మెరిసే బంగారు కనురెప్పల కిందినుంచి చూస్తాడు
అతని ప్రశాంత నయనాలలో
చిత్రమైన నవ్వొకటి దోబూచులాడుతుంది!
వయోలిన్‌ల నుంచి జాలువారుతున్న నిర్లిప్త స్వరాలు
గాలిలో తేలుతూ వేలాడుతున్న పొగను దాటి
ఏదో తెలియని రాగాన్ని పాడుతున్నాయి!
ఇప్పటికైనా నువ్వు పైనున్న స్వర్గానికి దీవెనలు ఇవ్వు
ఇన్నాళ్లకు నువ్వు నీ ప్రేమిక సమక్షంలో
ఏకాంత క్షణాలను జీవిస్తున్నందుకు...!!
మూలం: అన్నా అక్మతోవా
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

437
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles