అనివార్యంగా


Mon,December 10, 2018 12:47 AM

నువు యంత్రంలా తిరుగుతూనే ఉంటావు
అందమైన సాయంత్రం మంత్రమేదో వేసి మాయ చేస్తుంది
అవధుల్లేని ఆకాశం పరవశంగా గాలి తంత్రమేసి
నిను వశం చేసుకోవాలని తమకంగా వంగుతుంది
వంతపాడుతూ తనువంతా తపనతో తూగుతుంది
నిద్రకళ్ళ నగరం నిషాచూపులతో నిను కాపుకాస్తుంటే
పెళ్ళికళొచ్చిన యువకుడిలా పచ్చబొట్టుతో నువ్వు
బొట్టు పెట్టుకున్న ఉదయంలా భాసిస్తుంటే
రూఢిగా నరుడా... నువు భాస్కరుడివే...
అల్లుకున్న ఆశను మోసే తనూలత
నిలువెల్లా కంపిస్తోంది
కాస్త సాయంసంధ్యలో జీవైక్యం చెందుదామని
జాలువారే ఓ వాక్యాన్ని అందుకుని కవితనద్దాను
పన్నీరులాంటి పరిమళం జారే కన్నీటిని కప్పేస్తుంటే
దాచిపెట్టిన ఉద్వేగాలను విప్పేస్తుంటే
కనిపెట్టిన మనసు పరిష్వంగాన్ని వెతుకుతూ
అనివార్యంగా సాయంసంధ్యకు అంజలి ఘటిస్తోంది
- సి.యస్.రాంబాబు
9490401005

406
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles