చిక్కటి చీకటి ఘడియలోకి..


Sun,November 25, 2018 10:49 PM

ఈ కాలం ఇలాంటిదే --
యుద్ధం మాత్రమే కాదు
యుద్ధపు వికటాట్టహాసం కూడా బీభత్సమే
గాలి అంతటా భయోత్పాతమే!
ఆకలిగొన్న అంతులేని అఖాథాల నోళ్ళు
ఆవులిస్తున్న క్షణం
ఒక నక్షత్రం దిగివొచ్చింది
కొత్త ఆశల బాలుడొకడు
పరమాద్భుతంగా ఉద్భవించాడు!
ఈ కాలం ఇట్లాగే ఉంటుంది
భయ విహ్వలత ఒకవైపు
అధికార లాలస మరోవైపు
ఏమైనా చేసే అరాచకం,
ఆకాశాన్ని తాకే అత్యాశ,
విధ్వంసం చేసే విపత్తు ఇంకోవైపు!
ఐనా లోకానికి మహదానందాన్ని ప్రసాదించే యువరాజు
ఈ చిక్కటి చీకటి ఘడియల్లో ఇక్కడికి వేంచేశాడు
చాలా ప్రశాంతంగా నీరవ కాంతిలో!
ఇట్లాగే ఉండే ఇలాంటి కాలంలో
ఎల్లెడలా విచ్ఛిన్నత, విద్వేషం రాజ్యమేలుతున్న చోట
విలువలు క్షీణించిన సమయాన
అతని జననాన్ని ఎలా వేడుక చేసుకుంటాం?
ఆహా.. ఏమి అద్భుతం ఇది
భూగోళం మొత్తం మీద ఎక్కడా నిశ్చలత లేదు
కేవలం నా హృదయం మాత్రమే అచంచలం!
మూలం: మేడెలీన్ లే ఎంగ్లే
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231


మేడెలీన్ లే ఎంగ్లే

(1918 నవంబర్ 29-2007 సెప్టెంబర్ 6)
Madeleine-L-Engle
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జన్మించిన మేడెలీన్ లే ఎంగ్లే బాల్యం లో పాఠశాల వ్యవస్థలో ఇమడలేక పుస్తకాల్లో తన ప్రపంచాన్ని వెతుక్కునేది. ఎన్నో పాఠశాలలు మారి చివరికి స్విట్జర్లాండ్ కూడా వెళ్లి అక్కడ కూడా ఒదగలేక తిరిగి అమెరికాకు వచ్చి డిగ్రీ పూర్తిచేసింది. కానీ చిన్ననాటి నుంచి సృజనాత్మక రచనలు చేయడంలోనే ఆనందాన్ని పొందిన ఆమె, తన రచనలను ప్రచురణకు పంపిస్తే అవి వరుసగా తిరిగివచ్చేవి. తన 40వ ఏట వరకు ఆమె రచనలు పత్రికాఫీసుల వద్ద తిరస్కరణకు గురయ్యాయి. అయినా పట్టు వదలకుండా 1960లో A Wrinkle In Time నవలను రాసింది. ఈ నవల దాదాపు ముప్ఫైసార్లు తిరస్కరించబడి చివరికి 1962లో ప్రచురణకు నోచుకున్నది. ఈ నవల ఎంతో సంచలనాన్ని సృష్టించి రాత్రికి రాత్రే మేడెలిన్ గొప్ప రచయితగా గుర్తింపు పొందింది. ఇలా అతి పిన్న వయసులోనే రచనలు మొదలుపెట్టి, అతి ఆలస్యంగా 44 ఏండ్లకు గుర్తింపునకు నోచుకున్న ఆమె ఎన్నో పుస్తకాలను రాసింది. బాల సాహిత్యంలో, క్రైస్తవ సాహితీ రచనలో కూడా విశేష కృషిచేసిన ఆమె Lines Scribbled On An Envelope (1969), The Weather of the Hea rt (1978), A Cry Like A Bell (1987)వంటి కావ్యాలతో ప్రసిద్ధికెక్కింది.

542
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles