కొత్త తరాల తెలంగాణ


Sun,November 25, 2018 10:48 PM

telangana-new-generation
తెల్లవారితే ఓటు సూర్యుడు మేల్కొంటాడు
లక్షల గొంతులు ఒక్కటై నినదిస్తాయి
ఇది మా తెలంగాణ, మన తెలంగాణ అని!
గ్రామగ్రామాన ప్రగతి చందమామలు
ఇంటింటా పథకాల దీపకాంతులు
మనిషి మనిషిలో బతుకు భరోసా
చెరువులన్నీ కడిగిన కోనేర్లు
రహదారులు రాజమార్గాలే
నల్లానీళ్లు గంగా ప్రవాహాలు
కరంటు బుగ్గలోంచి నిరంతరశక్తి
పంటపొలాల నిండా ఆకుపచ్చని బంగారం
నా తెలంగాణ దారులన్నీ
కోటి ఎకరాల మాగాణంవైపే
దశాబ్దాల కుళ్లును కడుగుతున్నాం
అడ్డం పడకండి.. చీపుర్లు తిరగబడుతై
శతాబ్దాల తేజస్సును వెలిగిస్తున్నాం
ఇంధనాలై రండి.. కరిగే కొవ్వొత్తులమవుదాం
ఈ తెలంగాణ.. ఆ తెలంగాణ కాదు
నా తెలంగాణ కొత్త తరాల వీణ
మా స్వరాష్ట్రంలో రాజకీయాల రంగు మారింది
అందరం ఒక్కతాటిపైకి వచ్చాం
నాయకులంతా సేవకులే
మేమే ప్రభుత్వం.. ప్రభుత్వమంతా మాదే
ప్రభుత్వమంటే ఎవ్వరికీ పట్టనిది కాదు
ఇప్పుడు మా ఆత్మలకు అది ప్రతిరూపం
ఈ ఎన్నికల క్షీరసాగర మథనం.. మా కోసమే
అధికార లక్ష్మి అమృతభాండమూ మాదే
కాదు, కూడదని.. తెగబడేరు జాగ్రత్త
మా కనకపు సింహాసనం శునకాల కోసం కాదు
మీరు నోరు తెరిస్తే పుట్టెడు అబద్ధాల పురుగులు
బట్టలు కాల్చి మీదేసే బట్టేబాజ్ చేష్టలు
మాయమాటలు, కాలకూట విషాలు.. ఇంకానా?
ఆఖరకు.. మా మధ్యే గోతులు తవ్వుతూ
మాలో మాకు చిచ్చులుపెట్టారో.. ఖబడ్దార్
తెలంగాణ బిడ్డలం..బ్రహ్మాస్ర్తాలమవుతాం
బ్యాలెట్ బాక్సుల బడబాగ్నిలో చుట్టచుట్టి
కనిపించనంత దూరం కాలబిలంలోకి విసిరేస్తాం
అదుగో.. భళ్లున తెల్లవారుతున్నది
కోటి సూర్యకాంతితో ఓటుశక్తి ఉదయిస్తున్నది
మా తెలంగాణకు .. అది సరికొత్త చంద్రోదయం!
- దోర్బల బాలశేఖరశర్మ 8096677410

441
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles