ఛాయా స్వరం!


Sun,November 18, 2018 10:55 PM

నా నీడ నన్నడిగింది
విషయం ఏమిటి అని!
ఈ వెన్నెల వెచ్చదనమే నీకు సరిపోవట్లేదా ?
మరొక దేహపు దుప్పటిని
నువ్వెందుకు వాంఛిస్తున్నావు అని !
ఈ సమయాన ఎవరి చుంబనమో
నదీ తీరం మీద నాచులా
వన భోజనపు బల్లల చుట్టూ
వెలుగు లీనే గులాబీ హస్తాల్లో
ఇమిడి పోయిన రొట్టెల్లో నిక్షిప్తం అయి ఉంది!
పెరిగిన హృదయ దూరాలు...
ముక్కలు ముక్కలైన మనసులు !
ఎవరిలోకి వారు ముడుచుకుపోయాక
తాజా పిండి వంటలపై ముసురుతున్న ఈగలు!
ఇంతకీ ఈ దుప్పట్లో ఏముందో నీకు తెలుసా?
తెలీదు కాక తెలీదు!
చిన్నపిల్లలు యుద్ధం ఆట ఆడుకుంటున్నారు
తుపాకుల కాల్పుల ఉధృతికి
ఆరుబయటి చెట్లు వంగిపోతున్నాయి
వాళ్ళని వంటరిగానే వదిలెయ్యండి
వాళ్ళు వారిదైన ఆటల్ని
వారి పద్ధతిలో ఆడుకుంటున్నారు
వాళ్ళలోకంలో వాళ్ళని విహరించనియ్యండి!
అయినా, ఇన్ని గోలల మధ్య
నిన్ను ఎప్పుడూ కనిపెట్టుకునే ఉన్నాను కదా!
నీ దాహం తీర్చడానికి నీళ్ళిచ్చాను
నీ ఆకలి తగ్గించడానికి శుభ్రమైన రొట్టె ముక్కలనిచ్చాను
ఇప్పుడు చెప్పు,
నీ రక్త నాళాల్లో ప్రవహిస్తున్న పదాలు
నీ నిరంతర ప్రస్థానానికి కొనసాగింపులు !
ఇంతకీ అవి సరిపోయేంతగా ఉన్నాయా, లేవా?
-మూలం: మార్గరెట్ ఆట్ వుడ్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231


మార్గరెట్ ఆట్ వుడ్
(1939, నవంబర్ 18)
Margaret_Atwood
కెనడా రాజధాని అట్టావాలో జన్మించిన మార్గరెట్ ఎలియనార్ ఆట్ వుడ్, తన 6వ ఏట నుంచే రాయడం ఆరంభించింది. బాల్యం నుంచే ఆమెలో మొదలైన అధ్యయన పిపాస తర్వాతి జీవితంలో ఆమె కవిగా, నవల, అపేరా, టీవీ సీరియల్స్, సినిమా కథా రచయితగా, స్త్రీ వాదిగా, పర్యావరణ హక్కుల కార్యకర్తగా, ఉపాధ్యాయురాలిగా బహుముఖ ప్రతిభ కనబర్చడానికి దోహదం చేసింది. తన రచనలన్నింటిలోనూ కెనడా దేశ ప్రజలు- సంస్కృతీ- వారి సంఘర్షణలను సహజత్వానికి దగ్గరగా చిత్రించడం వల్ల ఆమె, కెనడా అస్తిత్వ ప్రతీకగా జేజేలు అందుకున్నది.
ఆమె Double Persephone (1961)తో మొదలెట్టి, The Circle Game (1964), The Animals in that Country (1968) కావ్యాలలో మానవ ప్రవర్తనను, ప్రకృతిని, ఆధునిక వస్తు సంస్కృతిని విమర్శనాత్మకంగా, సౌందర్యాత్మకంగా చర్చించింది. అలాగే Power Politics (1971), Two-Headed Poems (1978) ద్వారా తాత్విక-రాజకీయ-ప్రగతిశీల భావనలను వెల్లడిచేసింది. The Heart Goes (2015) తో సీరియల్ ఈ-బుక్‌ను, షేక్‌స్పియర్ The Tempestను Hag-Seed (2016) పేరుతో Retelling చేసి సాహితీ ప్రయోగాలెన్నింటికో పునాదులు వేసింది. 2006లో ప్రతిష్ఠాత్మక బుకర్ పురస్కారాన్ని సాధించింది!

448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles