శరణార్థి శిబిరంలో మాతృమూర్తి!


Sun,November 11, 2018 11:03 PM

మాడొన్నా మాత కూడా
ఆ తల్లి ముందు తలవంచాల్సిందే
ఆమె బిడ్డ మీద ఆమెకున్న మార్దవత- మమకారం విషయంలో...
ఇదంతా ఆ తల్లి త్వరలోనే మర్చిపోయి ఉండాలి.
ఇక్కడి గాలి అంతా
డయేరియా దుర్వాసనతో బరువెక్కి ఉంది
విరోచనాలతోనే నీరసించిన పిల్లలు
పేగులు మెలిపడి లోపల ఏమీ మిగలని డొక్కలు
శూన్యమైన పొట్టలోంచి పైకి తేలిన పక్కటెముకలు
కనీసం నీళ్లతో కడిగే దిక్కులేని దేహాలు...
అక్కడ ఉన్న కొంత మంది తల్లులు
తమ పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవడాన్ని
ఏనాడో మరిచిపోయారు
కానీ, ఈ తల్లి అందరి లాంటి తల్లి కాదు కదా
అందుకే, ఆమె పళ్ళ దిగువన అకారణ ఆనందం కదలాడుతోంది
ఆమె కళ్ళలో ఓ చిన్ని గర్వం తొణికిసలాడుతోంది
బహుశా, ఆమె బిడ్డ చేసిన ఏ అల్లరి పనో గుర్తుకొచ్చి ఉంటుంది!
ఆమె అతనికి చక్కగా స్నానం చేయించింది
అరచేతులతో అతని దేహాన్నంతా శుద్ధిగా రుద్దింది
ఆమె దగ్గరున్న లెక్కకు మిక్కిలి సరంజామా లోంచి
విరిగిన దువ్వెన ముక్కను వెదికి తీసి
అతని తలమీద ఎర్రబారిన వెంట్రుకలను
సరిచేసి దువ్వింది
ఆ తర్వాత కళ్ళతోనే లాలి పాట పాడుతూ
శ్రద్ధగా పాపిట తీసే ప్రయత్నం చేసింది
వారిద్దరి పూర్వ జీవితంలో
ఉదయం భోజనం చేసి బడికి వెళ్ళడానికి ముందు
బహుశా, ఇది రోజువారీ నిత్య కృత్యమై ఉండవచ్చు
దీనివల్ల పెద్ద ప్రయోజనమూ- ఫలితమూ లేకపోవచ్చు
కానీ, అదే పనిని ఆ తల్లి
ఈ పూట కూడా ఎంతో నిష్ఠతో చేసింది-
చిన్నారి సమాధిపై పూలు పేర్చినంత భక్తిగా.....
మూలం: చినువా అచెబె
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231


చినువా అచెబె

(1930, నవంబర్ 16-2013, మార్చి 21)
Chinua-Achebe
సింహాలు తమ చరిత్రను రాయనంత కాలం వేటగాడు రాసిందే చరిత్ర అవు తుందనే వాక్యంతో ప్రపంచవ్యాప్తంగా అణగారిన ప్రజల గొంతుకగా గుర్తింపు సాధించిన ప్రజాకవి, రచయిత, ప్రొఫెసర్, రాజకీయవేత్త, పోరాటయోధుడు ఆల్బర్ట్ చినువాలుమొగు అచెబె!
నైజీరియాలోని ఇగ్బో పట్టణంలో జన్మించిన అచెబె, ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యానికి చుక్కానిగా కీర్తి గడించాడు. మొదట్లో నైజీరియన్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్‌లో ఉద్యోగం చేసినప్పటికీ, తర్వాత తాను రాసిన తొలి నవల Things Fall Apart (1958)తో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాడు. 1967లో నైజీరియా దేశం నుం చి స్వతంత్రం కోసం పోరాడిన బయాఫ్రా ప్రజలకు మద్దతుగా నిలి చి, ఆ దేశ ప్రజల రాయబారిగా వివిధ అంతర్జాతీయ వేదికల మీద వారి వాణిని వినిపించాడు. జాతుల స్వతంత్ర పోరాటాలకు ప్రోత్సా హాన్నివ్వడం ద్వారా నిజమైన సాహితీవేత్త నిరంతరం సామాన్య ప్రజల పక్షమే నిలుస్తాడనే విషయాన్ని తాను ఆచరణలో నిరూపిం చాడు. అయితే, బయాఫ్రా ఉద్యమాన్ని 1970లో నైజీరియా ప్రభు త్వం అణిచివేసిన పుడు, అచెబె పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశిం చాడు. కానీ, అక్క డ పొసగలేక అమెరికాకు వలస వచ్చి అక్కడి విశ్వ విద్యాలయాల్లో ఆఫ్రికన్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పని చేశాడు.

Beware Soul Brother and other Poems (1972), Christmas in Biafra (1973), Another Africa (1997), Collected Poems (2002) వంటి కావ్యాలు ఆయన రాసిన ప్రముఖ రచనలు. ఆఫ్రికాలోని విస్మృత సమాజాల పోరాటాన్ని, వలస పాలనలోని దుర్భర జీవితాలని తన రచనల్లో ఆవిష్కరించి, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా గాయం ఎక్కడైనా రక్తాన్నే చిందిస్తుందని, దుఃఖం ఎక్కడైనా కన్నీళ్లనే ప్రవహింపజేస్తుందని, మానవులందరి విశ్వ విషాదం ఒక్కటేనని నమ్మిన అచెబెను 2007లో ప్రతిష్ఠాత్మక బుకర్ పురస్కారం వరించింది.

1239
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles