జీవిక-జీవితం!


Sun,November 4, 2018 10:57 PM

నువ్వు తలుచుకుంటే
క్షణంలో నా జీవికను కోల్పోతానేమో..
నా దుస్తులు,మంచం
ఎవరైనా తన్నుకెళ్తారేమో..
నేను ఓ రాళ్ళు కొట్టే కూలీగానో
బరువులు మోసే హమాలీగానో
వీధులు ఊడ్చే చప్రాసీగానో జీవితాన్ని మోస్తానేమో..
నా ఆకలి తీర్చే అన్నం కోసం
జంతువుల పెండని కెలికి వెతుకుతానేమో...
నగ్న దేహంతో- నకనకలాడే ఆకలితో
నేను కూలిపోతానేమో..
ఓ నా వెలుగు విద్వేషకుడా
అయినా, నేను రాజీ పడలేను
ఆఖరి శ్వాస దాకా పోరాడుతాను
నా భూమిలో చివరి గజాన్ని కూడా
నువ్వు కబ్జా చేస్తావేమో..!
జైలు గది కందకాల్లో నా యవ్వనాన్ని పాతిపెడతావేమో
మా తాతలిచ్చిన వారసత్వాన్ని
కొన్ని వస్తువులను, వస్ర్తాలను, మరికొన్ని కూజాలను
నా నుండి దొంగిలిస్తావేమో..
నువ్వు నా కవితలను - కావ్యాలను కాల్చి వేస్తావేమో
నా మాంసాన్ని నీ కుక్కకి ఆహారంగా వేస్తావేమో
నా పల్లె పై నీ విధ్వంసపు భయాల
పీడ కలల్ని రుద్దుతావేమో..!
ఓ నా కాంతి శత్రువా
నేను మాత్రం రాజీ పడలేను
ఆఖరి క్షణం దాకా నేను పోరాడుతూనే ఉంటాను
ఓ నా వెలుగు శత్రువా
సంతోష చిహ్నాలు.. ఆనందాల కేరింతలు.. సంబర సంగీతాలు..
అవన్నీ ఆ రేవులోనే ఉన్నాయా
దిగంతాల దాకా విస్తరించాయా తెలీదు
గాలివాటుని - లోతైన సాగర జలాలను
ధిక్కరించి చేస్తున్న నౌకాయానమిది
అన్ని సవాళ్ళనూ అధిగమించి చేస్తున్న యాత్ర ఇది
పోగొట్టుకున్న సాగరాల నుండి
తిరిగొచ్చిన Ulysses ఇది
సూర్యుడి పురోగమనమిది
బహిష్కృతుల పునరాగమనమిది!
వాళ్ళ కోసమైనా ఒట్టేసి చెపుతున్నా
నేను రాజీ పడను గాక పడను
ఆఖరి చూపు దాకా
నేను యుద్ధం చేస్తూనే ఉంటాను...
మూలం: సమీ అల్-ఖసీమ్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

సమీ అల్-ఖసీమ్

(1939, మే 11-2014, ఆగస్టు 19)
Samih-Alqasim
మధ్య ఆసియాలోని అరబిక్ దేశాల్లో అత్యంత ప్రఖ్యాతి గాంచిన కవి, జర్నలి స్ట్, సంపాదకులు, రాజకీయవేత్త సమీ అల్-ఖసీమ్! ప్రస్తుత జోర్డా న్ దేశంలోని జార్ఖా పట్టణానికి దగ్గరలోని ఓ గ్రామంలో ఆయన జన్మించారు. అయితే ఆయన పూర్వీకులు పాలస్తీనా వాసులు కావడంతో ఈ కవి తనను తాను ఎప్పుడూ పాలస్తీనాతో ఐడెంటిఫై చేసుకునేవాడు. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఆస్థానంలో తండ్రికి ఉద్యోగం రావడంతో బాల ఖసీమ్ కూడా తరలివచ్చినప్పటికీ తన మూలాలు అన్నీ పాలస్తీనానే అని చెప్పుకునేవాడు. 1948లో ఇజ్రాయెల్ పాలస్తీనాను ఆక్రమించినప్పుడు ఖసీమ్ వయస్సు 11 ఏండ్లు మాత్రమే. అయితే తనలో భావావేశానికి కారణం, కారకం ఈ యుద్ధమే అని నమ్మే ఆయన, తన సమస్త ఆలోచనలు, సృజనలు అన్నీ 48 సంఖ్య చుట్టే అల్లుకొని ఉంటాయని చెప్పేవాడు.

అరబ్ జాతీయవాదాన్ని నిలువెల్లా జీర్ణించుకున్న ఆయన-రాజకీయాల ద్వారానే అనుకున్నది సాధించవచ్చని భావించి Rakah (ఇజ్రాయెల్ కమ్యూనిస్ట్ పార్టీ)లో క్రియాశీలంగా వ్యవహరించి లెక్కకు మిక్కిలిసార్లు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత Hadash అనే ప్రజాస్వామ్య పార్టీలో చేరి ప్రతి వేదికనీ, ప్రతి అక్షరాన్ని ఇజ్రాయెల్ లో మైనార్టీలైన తోటి అరబ్బుల గురించి, వారి జీవన స్థితిగతుల గురించి వ్యక్తీకరించడానికి ఉపయోగించాడు. ధిక్కార కవిగా నిరంతర ఆర్ద్రత, నిత్య సంఘర్షణాతత్వం, నిరుత్సాహపడని పోరాటస్ఫూర్తి ఆయన కవితలన్నింటిలోని అంతస్సూత్రం.

679
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles