శబరిగీత


Sun,November 4, 2018 10:57 PM

woman_crying
ఒక యుద్ధం ముగిసి కళ్లు తెరిచాక
రెండేళ్ల కూతురు దేహం
తెల్లచలవ రాతి విగ్రహంలా
పక్కన పడుకుని ఉండటం చూస్తావ్ నువ్వూ
కాళ్ల పైనుంచి దుప్పటి జారినట్టు
కలలు యే కాశ్మీరు లోయలోకో
శబరిమల అడవుల్లోకో తప్పిపోతుంటాయ్
పాప నుదుటిపై ముద్దు పెట్టుకున్నప్పుడు
తిరుపతిలో వెంకటేశ్వరున్నో
మక్కాలో అల్లానో
జెరూసలేంలో యేసునో
ఎవరో నిద్రలేపుతున్నట్టు
నెమలీకంతటి లేలేత పెదాలపై ఏదో ప్రార్థనని
తేనె రాసినట్టు వొంపుతావ్ నువ్వు
ప్రార్థనల తెరలు తీసి
ఆమెను గుండెకు హత్తుకుని
వెచ్చదనాన్ని గుండెనిండా నింపుతూ
తల్లిచనుబాల రక్తపు బొట్లను
నిప్పరవ్వలుగా చేసి
వేడెక్కుతున్న వేళ్లతో తన
నుదుటిమీద రుద్దుతుంటావు నువ్వూ
కూతురు చేతికి
కత్తినే ఇస్తావో
కలమో కత్తెరో ఇస్తావో
పుస్తకమో
పాలపుంతల సమూహమే ఇస్తావో
ఆడపిల్లంటూ తనమీద బురఖానో
ముసుగో కప్పుతావో
లేదూ..
ఆమె చుట్టూ మతం కంచె వేసి
దేశ సరిహద్దుల కొలతలు గీసి
యేయే స్థలాలు ఆమెవి కావని నిర్ణయిస్తావో
ఒక యుద్ధం ముగిసి కళ్లు తెరిచాక
రెండేళ్ల కూతురు దేహం
నీకు ఆలయంలోంచి వినిపించే
శ్లోకం
ప్రార్థన
అజా
యే దేవుడు తృణీకరించని పక్షుల పాట..
ఆమెను
రక్తమాంసాలతోనే పెరగనీ
కట్టుబాట్ల సిమెంటు-ఇసుకలతో
చలవరాతి చలనంలేని స్థితితో కాదు...
- మెర్సీ మార్గరెట్, 90528 09952

590
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles