దుబాయ్ చెప్పులు


Mon,October 29, 2018 12:26 AM

దుబాయ్‌లో బంగారు పాదరక్షలు
కోట్లకు కొంటున్నారట!
వజ్రాలు కూడా పొదిగారట!!
బేవ్ ఖూబీ కాకపొతే
చెప్పులు బంగారు వైతే
నడక బంగారమౌతుందా!
లోపలి నుంచి వెలిగే నవ్వుల ముందు
ఆభరణాల ప్రకాశమెంత!
మా యింటికి రండి!
నాపాత చెప్పులు చూపిస్తాను
నా మిత్రుడు కొమరయ్య చేసినవే..
దుమ్మును తుడవ లేదు
అది నా జీవన యాత్రలో
అంటించుకున్న సింధూరం.
చెప్పుల్ని చూడగానే
నా పాదాల్లో రక్తం జివ్వుమంటుంది
ఎవడో.. ఆ ఎముకల ఇంజనీరు
ఇంత పెద్ద దేహాన్ని మొయ్యటానికి
పాదాల్లో
నైష్పత్తిక గరిమరాభిని నిక్షిప్తం చేశారు
అతని పాదాలకు మొక్కాలి.
చెప్పులంటే..
పాదాలతో చెరగని స్నేహం
చెప్పులంటే..
బతుకుదెరువులను కలిపికుట్టే దూరం
చెప్పులంటే..
భావశబళితమైన
జీవితాన్ని మోసే అపారమైన భారం
నిజానికి చెప్పులే బంగారం
వాటికి ఏ నగిషీ చెక్కినా
అది వొట్టి లోహం...
- డాక్టర్ ఎన్.గోపి
(దుబాయ్‌లో బంగారు పాదరక్షలను
134 కోట్లకు కొన్నారనే వార్త చదివి..)

521
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles