నేను నీకు ఏమవుతాను?


Sun,October 21, 2018 10:54 PM

prapancha-kavitha
ఒక జింక
నీ చేతుల్లోంచి పరిమళపు గడ్డి పరకలను తింటూ ఉంది..
ఒక కుక్క
నీ అడుగు జాడల వెంట
నువ్వు వెళ్ళిన ప్రతి దిక్కుని అనుసరిస్తుంది
ఒక ఆకాశ తార నీకోసం
ద్విగుణీకృతం అయిన వెలుగులతో ప్రకాశిస్తూ
మిల మిల మెరుస్తూంది
ఒక వసంతం
అలలు అలలుగా కదలాడుతూ
నీకు పాదాక్రాంతమై పడి ఉంది
ఒక పుష్పం
నీకు మాత్రమే చెందేలా
దాని తేనెలు- సుగంధాలను వెదజల్లుతోంది

నేను అన్ని అవతారాలను ఎత్తింది
నీ కోసమే !
నా ఆత్మకున్న అన్నిరూపాల ద్వారా
నన్ను నేను అర్పించుకున్నది నీకే !

హరిణం, శునకం, ఆకాశంలోని నక్షత్రం
ఇంకా ఈ పూలు...
ఇప్పుడు నీ పాదాలను అభిషేకిస్తున్న జీవజలం
అన్నీ నేనే!
అవి మాత్రమేనా, నా ప్రియతమా..
మొత్తంగా నా ఆత్మ కూడా నీదే కదా... !
మూలం: జువానా డి ఇబర్ బరో
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231


జువానా డి ఇబర్ బరో

(1892 మార్చి8 -1979 జూలై15)
juana-de-ibarbourou
సాధారణంగా కరెన్సీ నోట్ల మీద ఆయా దేశాల జాతీయ నాయకులు, వీరుల బొమ్మలను ముద్రిస్తారు. కానీ, 1000 పీసో (ఉరుగ్వే దేశ కరెన్సీ) నోట్ మీద ఒక సాహితీవేత్త ఫోటో ముద్రించారు. అలాంటి అరుదైన గౌరవం పొందిన ఉరుగ్వే దేశపు జాతీయ కవయిత్రి జువా నా ఫెర్నాండెజ్ మొరాలిస్ డి ఇబర్ బరో! దక్షిణ అమెరికా ఖండంలోని స్పానిష్ భాషా కవులందరిలో అత్యంత ప్రజాదరణ పొందిన సాహితీమూర్తి. తొలినాళ్లలో శృంగార ప్రధానంగా కవితా రచన చేసినప్పటికీ, ఆ తర్వాత ప్రకృతిని, ప్రపంచాన్ని, మానవ సంబంధాలను తన దృక్కోణంలో పరిశీలిస్తూ కవితలు రాశారు. తన 17వ ఏటనే మహిళాహక్కుల మీద రచనలు చేసి దక్షిణమెరికా ఖండంలోని తొలితరం ఫెమినిస్ట్‌గా తర్వాతి తరం రచయితలపై చెరగని ప్రభావాన్ని వేసిన ఆమె, నాలుగుసార్లు నోబెల్ బహుమతికి నామినేటయ్యారు. డ్రగ్స్‌కు, జూదానికి బానిస అయిన కొడుకు వల్ల సమస్త సంపదనూ, ఆస్తులనూ పోగొట్టుకుని అవసాన కాలంలో అతి పేదరాలిగా మరణించారు. ఆమె కవితలు మాత్రం ఆమెను సాహితీ ప్రపంచంలో శిఖరస్థాయిలో నిలిపాయి.

691
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles