సముద్రమూ సింహాసనమూ


Sun,October 21, 2018 10:53 PM

WAVE
సముద్రం నాకేమీ చెప్పలేదు
నాకే కాదు
అది ఎవ్వరికీ ఏమీ ప్రత్యేకంగా చెప్పదు

తనలో తానే మథనపడుతుంది
ఎదో గొణుక్కుంటుంది
గంభీరంగా కనిపిస్తూనే
గట్టుకు తల బాదుకుంటుంది

లోపల సుడుల్నీ కల్లోలాల్నీ
తట్టుకోలేనంత ఘర్షణనీ
అనుభవిస్తూనే
కోటానుకోట్ల జీవరాశుల్ని సాకుతుంది
ఒక్కోసారి లోపలి కదలిక కల్లోలమై
పాపం సముద్రం అదుపు తప్పుతుంది
హుద్ హుదో, తిత్లీనో పేరేదయితే నేమిటి
అల ఉప్పెనయి
ఒడ్డును కుమ్మేస్తుంది
ఇల్లూ పిల్లా
చెట్టూ చేమా తేడా లేదు
ఉప్పెన దాడికీ, దాహానికీ
అన్నీ ఉనికిని కోల్పోతాయి

మునిగి ముక్కలవుతాయి
పగిలి చెక్కలవుతాయి
రెప్పల కట్టల్ని తెంచుకొని
కన్నీళ్లు ధారలుకడతాయి
సింహాసనం తీరిగ్గా లేచి
కళ్ళు నులుముకుంటూ
అధికారం డిప్పను కప్పుకొని
తాబేలుతో పోటీ పడుతూ వాలిపోతుంది

మునిగిందేమిటి మిగిలింది ఏమిటని
కాకిలెక్కలకు దిగుతుంది
జమాఖర్చులు చూసుకుంటూ
చేతులూపి వెళ్ళిపోతుంది

అవును మరి సింహాసనానికి
పుటుకయినా చావయినా
పండగే..!!
- వారాల ఆనంద్, 9440501281

480
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles