అన్యధా శరణం నాస్తి


Sun,October 21, 2018 10:52 PM

sun-rise
అప్పుడప్పుడు సూర్యున్ని
మేఘాలు కమ్మేస్తాయి..
కాని మేఘాలకు ఉనికి ఉండదు
విభీషణుడు తమ్ముడే
కాని కోవర్ట్‌గా మారడానికి
తమ్మునితనం అడ్డంకి కాదు
రాజ్యాధికారాలే కదా యుగయుగాలుగా
మనుషులను శాసిస్తున్నది
ప్రభువులు వ్యూహకర్తలై
పాచికలాడిన ఘటనలున్నాయి
కాలం మారింది...
ప్రజలు కూడా వ్యూహ చతురులై
నువ్వొస్తే ఏం తెస్తావు..
నేనొస్తే ఏం ఇస్తావ్‌గా మారిన
దిక్కుమాలిన సందర్భంలో
గెలిచినవాడే వీరుడు... ఇచ్చినవాడే కర్ణుడు
అప్పుడప్పుడు పద్మవ్యూహంలో
శత్రువులు మనను ఎక్కడో బంధించి
ఎక్కడో దాడి చేస్తారు
అభిమన్యుణ్ణి అసలే యుద్ధానికి పంపొద్దు
అందరూ విసిగి, అలసి అస్త్ర సన్యాసం చేసి
మందు కొడ్తున్నప్పుడు రహస్యంగా దాడి చేయాలె
దొంగే దొంగ దొంగఅనే రోజులు పోయినై
దొంగే పోలీస్ డ్రెస్‌లో వచ్చి నిన్ను షూట్ చేస్తాడు
ప్రతి మనిషీ ఒక దొంగే అని నమ్మడమే
ఒక ఉత్తీర్ణతా సూత్రం
దయాదాక్షిణ్యాలు లేని
శిరచ్ఛేదన క్రియే.. అనివార్య సిద్ధాంతం
కరవాలము దూయుట.. విజృంభించుట
శత్రు సంహారమును విశృంఖలముగా చేయుట
ఇదే.. ఇక శరణం నాస్తి
జయహో.. మున్ముందుకే మన అడుగు...
-రామా చంద్రమౌళి
9390109993

754
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles