బతుకు జ్ఞాపకం


Sun,October 14, 2018 10:57 PM

Bathukamma-song
నువ్వు వస్తుంటే.. తీపిరాగాల మా అమ్మమ్మ
ఉయ్యాలవెంటేసుకుని నన్నుచుట్టేసినట్టుగా వుంటుంది
నువ్వు వస్తుంటే నా కోసం దాసిపెట్టిన
అమ్మలాలింపు తరలివస్తున్నట్టుగా వుంటుంది
బతుకమ్మా బతుకమ్మా!
నువ్వేకదా! నా బాల్యపు పూదోటని
రంగురంగుల స్వప్నాలుగామార్చింది!
నువ్వొస్తున్నావంటే చాలు!
ఇంటివెనకాల భూమిని కమ్మేసిన గుమ్మడిచెట్టు
పసుపుపచ్చ చిలుకలై రెక్కలు విప్పుకునేది
దడిమీద ఎగబాకిన కట్లచెట్టు
సగం ఆకాశాన్ని శ్వేతనీల నక్షత్రాలతో సింగారిస్తుంది
ఎవరికీ పట్టనట్టుండే తంగేడుచెట్టు...
పసుపునీట జలకాలాడిన నిండుముత్తైదువై విరగనవ్వేది
చెలకలోని గునుగుచెట్టు ఆకాశంలోకి ఎక్కుపెట్టిన
వెండికంకులఅంతఃపుర ఉద్యాన వనమయ్యేది.
ఇంటిముందటి బంతిచెట్టు ఒళ్ళంతా
పసుపుముద్దల పరవమైపోయేది
స్నేహితులంతా రంగురంగుల ఓణీలు చుట్టుకొని
ఙ్ఞాపకాల వరదల్లో ఈదుతూ వచ్చి నన్నమాంతంచుట్టేస్తారు
బతుకమ్మ!బతుకమ్మా!
నువ్వు వస్తుంటే నా అడుగులో అడుగై చేతిలొచేతులై
ఒక సమూహ చప్పట్లగానమై..
అర్ధరాత్రి దాకా మారుమోగిన చప్పట్ల
బతుకు వుయ్యాల పాటలై వూరంతా పారుతయ్
నిన్నుగంగలోకి సాగనంపి ఇంటికి వస్తుంటే
కూతుర్ని అప్పగింతలు చేసి
వెనుదిరిగిన తండ్రి హృదయమై బరువవుతుంది.
అప్పటిదాకా పోటెత్తిన వుయ్యాల పాట
వరద తగ్గిన వాగవుతుంది
కానీ.. వచ్చేఏడు నువ్వు మళ్ళీ వస్తావనే ఆశల నక్షత్రం
ఆకాశాన చటుక్కున మెరుస్తుంది..
- సీహెచ్ ఉషారాణి, 9441228142

157
Tags

More News

VIRAL NEWS