డిలాన్ థామస్


Sun,October 14, 2018 10:56 PM

(1914, అక్టోబర్ 27-1953, నవంబర్ 9)dylan-thomas
ఇంగ్లీష్ సాహిత్య ప్రొఫెసర్ అయిన తండ్రి ద్వారా బాల్యం నుంచే కవిత్వాన్ని వింటూ పెరిగిన డిలాన్ మార్లెయస్ థామస్, తన అనారోగ్యం, ఆత్మన్యూనత, సిగ్గరితనం వల్ల చదువుకు 16వ ఏటనే స్వస్తి పలికా డు. ఇంగ్లిష్ తప్ప అన్ని సబ్జెక్టులనూ నిర్లక్ష్యం చేసిన ఆయన South Wales Daily Post పత్రికా విలేకరిగా జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పూర్తిస్థాయి కవిగా మారి, తన 20వ ఏట తొలి కవితా సంకలనం 18 కవితలను ప్రచురించాడు. BBC Radio కి స్క్రిప్ట్ రచయితగా, Me and My Bike, Rebeccas Daughters వంటి సినిమాలకు కథా రచయితగా పనిచేశాడు. ఇటలీ, అమెరికాలలో విస్తృతంగా పర్యటించి కావ్య పఠనను ఒక కళగా ప్రచారం చేశాడు. Romanticism ఛాయలో, గాఢమైన ప్రతీకలను పొదిగి, ఎన్నెన్నో మానవ భావోద్వేగాలకు తన కవిత్వంలో పట్టంగట్టిన డిలాన్ The Map of Love (1939), The World I breath (1939), Deat -hs and Entrances (1946), In Country Sleep and other Poems (1952) వంటి కావ్యాలతో, సాహితీలోకంలో బలమైన ముద్రవేశాడు.

నిట్టూర్పుల లోంచి

వేదన వృక్షపు ఛాయకు ఆవల
దీర్ఘకాల నిట్టూర్పులలోంచి ఓ చిన్ని ఆశ ఉద్భవిస్తుంది
విషాదపు మహా ఆయుధంతో దాన్ని నేను నేల కూలుస్తాను
ధైర్యం మొలకెత్తుతుంది
మర్చిపోతుంది.. వెక్కివెక్కి ఏడుస్తుంది
మళ్ళీ ఓ చిన్నారి ఆశ తొంగి చూస్తుంది
ఆస్వాదిస్తాం.. బాగుంది అనుకుంటాం
మొత్తంగా ఏదీ నిరాశ పరచదు
గొప్పగా ప్రేమించకపోయినా ఫరవాలేదు
కనీసం ఒక ప్రశంస, ఒకింత నిశ్చింత కావాలి
శాశ్వత ఓటమి పొందిన తర్వాత
నిగ్గు తేలే సత్యం మాత్రం ఇదే!
మొదటి అడుగు వేసిన మనిషికి
జ్ఞాత బలహీనతల మధ్య యుద్ధానంతరం
మృత్యువును మించినదేదో అనుభవంలోకి వస్తుంది
నొప్పులన్నిటినీ మటుమాయం చేసి గాయాన్ని కప్పేసి
ఆ విషాదాన్ని మాత్రం గుండెల్లో మోస్తూనే ఉంటాడు
తనకోసం ఎదురుచూస్తున్న ఓ అనామకురాలిని
అర్ధాంతరంగా వదిలేసాననే చింతయినా లేకుండా..
ఇది దుర్భాషల మురికిని నిలువెల్లా కప్పుకున్న సైనికుడి నిస్తేజం
చిమ్ముతున్న పచ్చి నెత్తురు ఒలుస్తున్న నిజం
ఈ నొప్పిని తగ్గించడానికి అది సరిపోతుందా
వగచి వగచి చింతించిన వృథా సమయాలు
కలలన్నీ నెరవేరాక నాలో సంతోషాన్ని నింపే ఘడియలు
ఇదెంత ఆనంద సందర్భం
అది నిలిచేది యెంతకాలం
ఈ అస్పష్టత యుక్తమైనదేనా? తీయని అబద్ధాలు సమృద్ధమేనా?
ఈ ఖాళీ మాటలు సమస్త దుఃఖాన్నీ మూట కట్టగలుగుతాయా?
నా సమస్త రోగాలనీ అవి నయం చేస్తాయా?
ఇది సరిపోతుందా
ఎముకలు, రక్తం, కండరాలు
మెలిపడ్డ మెదడు, తెల్లగా మెరిసే ఊరువులు
పళ్ళెంలోని ఆహారాన్ని గతికే కుక్క తీరు మార్చడానికి.
మనిషి చిరాకు నుండి స్వాంతన పొందాలి
దాని కోసం ఈ నిమిషం, మీకు నేను అర్పిస్తున్నాను
జ్ఞాన శకలాలను.. అనుభవాల గాదెను..
ఆశల పలుపు త్రాడును..!
మూలం: డిలాన్ థామస్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

467
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles