ప్రేమశిల


Mon,October 8, 2018 01:43 AM

Prema-shila
హవ్వ! ఈడ
చెట్లు జుట్లు ముడేసుకున్నై
కొండలు, పొట్టిగుట్టల నెత్తుల్జూస్తున్నై
సోల్పూతుగా నడుస్తూ నడుస్తూ
ఆగినట్లున్న బోళ్ళమీద
తెల్లని పండ్లన్నీ తెరిచినవ్వే
టేకు వనం మీద
పరుగు పందెం బెట్టుకున్న పిట్టల గుంపు
ఉయ్యాల జంపాలలూగుతుంది
సంధ్యలో గజ్జె కట్టడానికి
పగలే ఆకుపచ్చని తివాచీ
సింగారించుకుంది!
నిలకడెరుగని కృష్ణమ్మ
నిలువడంలోని మురిపెం తలపోస్తుంది
నిలువు నగాలకు బిందువుల
పోగులిచ్చి
ముదురాకుపచ్చ పట్టుచీర చుట్టింది!
అక్కడెక్కడో మల్లన్న ఆగమంటే
ఇక్కడ పల్లె మూడంచులూ
తడిమి చూస్తోంది..!
ఆగమన్నందుకు
నది సముద్రమైతదా
విస్తరించమంటే
ఊరిని కొండెక్కిస్తదా
గీయకముందే
రెండు రాష్ర్టాలకు సరిహద్దు రేఖ చెరిపేస్తదా..!
ఈ కొసకూ
ఆ శిఖరానికీ
నాటు పడవల ఊహాదారాల మీద
ప్రయాణం పూలు గుచ్చుతరు
నది.. సముద్రంలో కలిపినప్పటి ఆలింగనంలా
వాళ్ళు రాష్ట్రం దాటిస్తరు
నదిని పడవ తెరతో కప్పి
మనల్ని అవతలి తీరం చేరుస్తరు
నీరు పడి చెరిగిపోయిన సిరా రాతలా
జలగర్భంలో కరిగిపోయిన
తమ జ్ఞాపకాల్ని నెత్తికెత్తిస్తరు
ఎప్పటికీ నీళ్ళతో దోస్తానం
వాళ్ళ హృదయాలకు తడి అద్దిందేమో
అక్కడి ఊరోళ్ళు
సోమశిలను
ప్రేమశిల చేస్తరు
- ఏనుగు నరసింహారెడ్డి
89788 69183

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles