స్వేచ్ఛాగీతం


Mon,October 1, 2018 01:20 AM

Swetcha-geetham
తరతరాల బానిస బ్రతుకుల నుండి
విముక్తి కోరుతోంది స్త్రీ లోకం
ఆంక్షల ఇనుపకచ్చడాల మధ్య, ఆశలు సమాధులవుతున్నాయి
రాజ్యాలు వీర భోజ్యలయ్యాయి
రాణులు మదోన్మత్తుల పాదాక్రాంతులయ్యారు
అనాదిగా ఆడది అంగడి సరుకయ్యింది
బలమున్నవాడి చేతి ఆటబొమ్మయ్యింది
చంఘీజ్‌ఖానులు, తామర్లేనులు, ఖిల్జీలు, పాదుషాలు
పాలకుడెవడైతే నేం.. ఒక్కోరాజు శతాధిక
మగువల పాలిటి యమరాజు..!
అవి కోటలు కావు వేలాది మగువల వేడి నిట్టూర్పులలో
కందిపోయిన శిథిల బందీఖానాలు
ఆశలు కాలి బూడిదైన కాంక్షాభరిత చలిత్‌ప్రేతాల నిలయాలు
వేల సహగమనాల సజీవ సాక్ష్యాలు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా?
ఉన్నత ధర్మాసనం మగువల మోరాలకించింది
తరతరాల అణచివేతకు చరమగీతం పాడింది
ఇహనైనా మా జీవితాల్ని మమ్మల్ని బతుకనియ్యండి
కలల అలల గమకాల్లో తేలిపోనీయండి
వీలైతే మాతో సమాగమించండి
నాడు తాళికోసం ప్రాణం తృణప్రాయమయ్యింది
నేడు కాంక్షల వలయంలో అలంకార ప్రాయమయ్యింది
కాంక్షాభరిత మోహంలో అందరూ బందీలే!
అసమానతల అడకత్తెరలో నిస్సహాయులే!
సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతోంది భరతావని
మనుస్మృతి స్థానే నూతన స్మృతిగీతం కోసం
బలవంతపు బంధాలకన్నా ఇచ్ఛాపూరిత
సహజీవనానికి మొగ్గుతోంది
సంకెళ్లను ఛేదిద్దాం.. స్వేచ్ఛాగీతాలనాలపిద్దాం..
తాళి పవిత్రమే! కాని అది మెడకు బిగుసుకోనంతవరకే..
బలవంతపు బందీఖానా కానంతవరకే..
స్వేచ్ఛా మంచిదే! కానీ అది విశృంఖలం కానంతవరకే..
గుంటనక్కలు వీధివీధినా కాచుకున్నాయి
సానుభూతితో మోసగిద్దామని
తోడేళ్ళు నిశిమాటున పొంచి ఉన్నాయి
స్వేచ్ఛ పేరున గొంతు నులుపుదామని.. జాగ్రత్త సుమా...!
- ప్రతికంఠం దత్తాత్రేయరాజు, 9959475471

531
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles