వేదన!


Mon,October 1, 2018 01:20 AM

వేదన..,
Vedhana
వేదనే నా తరతరాల వారసత్వ సంపద
నా స్వరాన్ని ఛిద్రం చేసిన గాయం
నా హృదయ రోదన
మొత్తంగా ఈ ప్రపంచానికో శోక గీతం!
ఇప్పటి ఆకాశం
నురగలు కక్కుతున్న సముద్రం
అంతరిక్షం ఓ శవం
గడ్డకట్టి బిగుసుకుపోయిన హస్తంలా రాత్రి!
ఇపుడీ చిక్కటి వనాలు
దృఢంగా ఎత్తుగా నిటారైన శిఖరాలు
పచ్చదనం కరువైన బంజరులు
కుప్ప కూలిన మరుగుజ్జు ఆకాశానికి వ్యతిరేకంగా
ఎగిసి నిలుస్తాయి
ఇదంతా ఎంత కష్టమో కదా
బిగదీసుకొని శిలలా మారడం
చీకట్లోకి, అశ్శబ్దంలోకి కూరుకుపోవడం..!
అంధకార మందిరంలో
చేతుల కళ్ళతో వెదుకులాడాను
నా వేలి కొసలకి ఏదో గుచ్చుకున్న అనుభూతి
బహుశా మొనదేరిన కొండ అంచు కావచ్చు!
విలవిలలాడేలా నొప్పి
చేతుల్ని విరిచేసి విసిరేసాను
కొండల మీదికి -కారడవుల మీదికి
ఇనుప గగనపు నిశీధి పైకి
శీతల భూతలం మీదికి..!
ఆఖరికి వేదన.. వేదనే
నా యుగయుగాల పరంపర
గాయం పలికే గానం
ఈ లోకంలో
మనసు వెక్కిళ్ళ మౌన దుఃఖం...!
మూలం: పార్ లాగర్ క్విస్ట్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

451
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles