లిటిల్స్ స్టార్స్


Mon,October 1, 2018 01:16 AM

littles-stars
పూచిక పుల్లల్ని
ఎన్నిసార్లు తొక్కుకుంట వెళ్లలేదు!
ఇవాళ వాటి చప్పుడే
ఓ పాము కాటు నుండి కాపాడింది!
పిన్నీసెంత?
పిసరంత.
కష్టకాలంలో అది
నా స్లిప్పర్లకు నడకను దానం చేసింది.
చిటికెన వేలంత
జిందాతిలిస్మాత్ సీస
అలమారిలో
ఏ మూలనో నక్కి కూచుంది
ప్రాణాలు తోడేసే పంటి నొప్పిని
అడ్డుకొని సిపాయిలా నిలబడింది.
అది బెత్తెడు కాగితం స్లిప్పే
దానిమీద రాసిన ఫోన్ నెంబరు
న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో
నన్నాదుకుంది.
ఒక నట్టు ఎక్కడో రాలిపోయి
వాకిట్లోనే దొరికి
మా వాడి సైకిల్‌ను
ముందుకు పరిగెత్తించింది.
ఆ గుండుసూది లేకపోతే
నా కాగితాల కట్టలోని భావాలు
చెల్లాచెదురై వుండేవి.
దూరంగా పాకి వస్తున్న చీమను
తదేకంగా చూడండి..
క్రమశిక్షణా పట్టుదలను
నేర్పిన నా చిట్టి గురువది.
చిన్న రెక్కలతో
దేశమంతా చుట్టి వచ్చాయి
నానీ పద్యాలను
ఓసారి పరికించండి.
సైజులో ఏముంది!
సందర్భంలోనే
స్వారస్యం వెలుగుతుంది
సందర్భంలోనే
సామాన్యుడు మాన్యుడవుతాడు.
ఆకాశయానంలో కూడా
నేను నేలమీద ఎగిరే
సీతాకోక పుష్పాన్నే తలుచుకుంటాను.
అంతెందుకు!
జేబులో
చిన్న పెన్సిల్ ముక్క లేకపోతే
ఈ కవిత పుట్టి వుండేది కాదు...
- డాక్టర్ ఎన్.గోపి

525
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles