మెర్రిల్ లెఫ్లర్ (1941 జననం)


Mon,September 24, 2018 12:52 AM

merril-leffler
న్యూయార్క్‌లో పుట్టిపెరిగి నాసాలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేసినప్పటికీ సాహిత్యంలోనే, కవిత్వంలోనే తనకు ఆత్మానందం ఉందని గమనించి అక్షరారాధనకే మొగ్గు చూపిన కవి మెర్రిల్ లెఫ్లర్! సైన్స్ రచయితగా, భౌతిక శాస్త్రవేత్త గా, పత్రిగా సంపాదకుడిగా సమకాలీన అమెరికన్ సాహిత్యంలో తనదైన ముద్రవేశారు. Partly Pandemonium, Partly Love (1984), Take Hold(1997); Mark the Music (2012) వంటి కవితా సంకలనాలు ఆయన సాహితీ సృజనకు ఆనవాళ్ళు. నిస్పృహతో కూడిన అశాంతి తన రచనలకు తొలి స్ఫూర్తి అని చెప్పుకునే లెఫ్లర్, సాహిత్యం-కవిత్వంపై ఎన్నో విశ్వవిద్యాలయాలలో ఉపన్యాసాలు ఇచ్చి, పదాల దేహాని కి అతీతమైన మనోభావనలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చి ఆధునిక వచన కవిత్వంలో మరిన్ని స్వేచ్ఛావాద ధోరణులకు తెరతీశాడు.

కూల్చివేత!

ఇప్పుడిక తలకెత్తుకోవాలి ఒక ఆలోచనని
(బహుశా అది భారమవుతుందేమో, జాగ్రత్త!)
మస్తిష్కం ఓ మహా చెత్తకుండీ
కెలికి కెలికి వెతికి వెతికి వెలికి తీయాలి
ఆ తర్వాత దానికో అర్థాన్ని వెతకాలి
అదంత సుళువు కాదనేది గమనించు
నీ వద్ద ఎన్నో సరైన సాధనాలు ఉంటేనే
అది అంత క్లిష్టం కాదు!

ఇపుడిక వాక్యాల వంతు--
ఒక్కో వాక్యాన్ని లాలించు
వ్యాకరణపు ఉడుపుల నుంచి వివస్త్రను చేయి
(నున్నగా తీర్చడానికి నువ్వో ఉప్పు కాగితం కావాలి)
ఆ నగ్న వాక్యాలన్నిటినీ ఒక వరుస తీగపై వేళ్లాడదీయి
అవన్నీ పూర్తిగా ఆరిపోయి పొడిగా మారతాయి
అప్పుడు ఒక్కొక్కదాన్ని దించేసి పచ్చగడ్డిపై పరిచేయ్
ఒకవేళ నువ్వు నగర జీవివైనా పర్లేదు
రోడ్డు పక్కన కాలిబాటని వాడొచ్చు
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే--
నువ్వెక్కడ ఉన్నా
వాటిని ప్రమాదపు అంచులపై
నిలిపావా లేదా అనేది నిర్ధారించుకోవడమే!

వాటిని రక్షించాలని అసలేమీ ప్రయత్నించకు
వాటిని నియంత్రించాలని ప్రయాసపడకు
స్వేచ్ఛగా వదిలేయ్--
అవి యుద్ధానికి వెళ్ళొచ్చు
ఎడారిలో గమ్యరహితంగా తిరగొచ్చు!
యథేచ్ఛగా విడిచెయ్--
బిచ్చగాళ్ళ లాగా వీధులన్నింటిని గాలించొచ్చు
పోలీసుల నుంచి పారిపోవచ్చు
ఒంటరితనాన్ని, నిరాశగా మౌనంగా భరించవచ్చు!
గుర్తుపెట్టుకో
వాటి దారిని అవే వెతుక్కుంటాయి !

ఇప్పుడిక,
నువ్వు చేయగలిగిన గొప్ప సాయం ఏంటో తెలుసా?
వాటి నుంచి దూరంగా ఉండటమే
ఒకవేళ అవి తిరిగి వచ్చాయనుకో,
అప్పుడు మాత్రమే వాటిని గుండెలకు హత్తుకో!

మూలం: మెర్రిల్ లెఫ్లర్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ 8008005231

699
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles