ఎదగాల్సిన సమయం


Mon,September 24, 2018 12:51 AM

ఆకాశం చంపుతున్నది
అనంత విశ్వాన్ని కాపలాగాయగలదేమోగానీ
ఆపదలో ఉన్న విశ్వాసాన్ని కాలరాస్తున్నది

ఎండినమట్ట పీచుకక్కరకొచ్చినట్టు
మంటకక్కరకొచ్చినట్టు లేదాయె
మంది మార్బలాల కొలతల్లో నీ మనస్సెంత కురుచది?

పొద్దటి తిండికి పొద్దుగూకి నిద్రకుదప్ప
ఎందుగ్గొరగాని నీ అహంభావమెంత ఎడ్డిది?

తలుపులు మూసుకుపోయిన బుద్ధి
చీకటిదారుల బీభత్స సంచారపు ఊచలెక్కల చిక్కులన్నీ రాయలేని పత్రానివి
గర్వితుని జేసిన పెత్తనమంతా నిన్ను బురదకీడ్చిపెట్టె
పోటీలల్ల గెలవని పక్షుల పరుగుల బంధమా ఎట్ల ఇది?
పొట్లంగట్టిన ప్రేమంతా కాళ్లకుకాసిన పువ్వులై చిట్లె
మిఠాయిలిచ్చిన చేతులు విషాన్నిగక్కె!
పచ్చని బతుకును నరికి కట్టిన మూట కుత్సితకంపు
నీ శేష జీవితం ఒట్టిన కుండ, ఎండిన చెరువు
నాల్గుగోడల్ల నువ్వు శబ్దక్రౌర్య సంకేతాలనువిను
అథఃపతనానికి, అంధకార గమనానికి, మరుభూమికి
బిడ్డడెవ్వడైతేనేమి కడుపుతీపికింత కాఠిన్యమా!
అవమానభారమే నీనెత్తికి ముళ్ళకిరీటమైతే
పరిష్కార పరిష్వంగంలో చంపుకోవాల్సింది
నీలోని భావ దారిద్య్రాన్ని
పుట్టెడు దుఃఖ ప్రణయాన్ని ధరించి వర్షిస్తున్న అమాయకతది
ఆకాశమూ రోదిస్తున్నది అనంత విశ్వానికి జవాబుచెప్పలేక

కన్నీటిపొగ నల్లగ ద్రవించి కనుపాపల పసిదనపు బొమ్మగట్టి
అమ్మరూపై అనునయాల పొగబండి మజిలీలనె
భూమి రక్తనాళాల గుండె గోడు నీలోకి ప్రసరించు
ఇరగగాసిన చెట్టు వింత నడకలో ఆత్మవిమర్శకు జల్లెడబట్టు
అవసరమై లోకానికి కనిపించు
ఇవ్వాళ చెయ్యాల్సింది మసిబట్టిన అద్దాన్ని శుభ్రపరచడం
అడ్డుగోడలదాటి ఎదగాల్సిన సమయమిదని గ్రహించడం

- కొండపల్లి నీహారిణి, 9866360082

537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles