ఒక దుఃఖం.. ఒక ఓటమి..ప్రేమ!


Mon,September 24, 2018 12:49 AM

3-love
పున్నమినాటి వెన్నెల
నేలపై విస్తారంగా పరిచినట్టు

పూల తోటలో పరిమళం
విశాలంగా ఆవరించినట్టు

సముద్రపు నీటి అల
ఉద్వేగంగా ఉప్పొంగినట్టు

ఒకరి హృదయంపై
మరొకరి దస్తకత్

పెళ్లి!

రెండు జీవితాలు పెనవేసుకుని
నర్తించే వేదిక

ఒకరి చేతిలో మరొకరి చేయి
ములాఖత్

నాలుగు పాదాలు రెండై
అడుగులో అడుగై సాగే ప్రయాణం

మూడు ముచ్చట్లూ
ఆరు ఆనందాలై విరబూసే బంధం

ద్వేషం!

కులమో మతమో
అరిగించుకోలేని కడుపుమంట

డబ్బో దస్కమో దాటేయలేని
ఓ ఎడారి భావన

మాట నెగ్గాలనే అహం
గెలవలేనేమోనని న్యూనత

మనసులో పుట్టి దేహమంతా వ్యాపించి
దహించాలని దగ్ధమైపోయే వైకల్యం

హత్య!

దేహం మీద పాకే చీమని
రెండు వేళ్ళ మధ్య నలిపెపేసినట్టు
ప్రేమని చిదిమేసే వేటగాడి ముఖం

గావురంతో పెంచుకున్న పావురాన్ని
ఒంటరిని చేస్తూ జంట పావురాన్ని చిదిమేసే కావురం

రిక్తమయిన బతుకులో
శూన్య ప్రవాహాలు

ఒక హత్య రెండు జీవితాలనే కాదు
రెండు కుటుంబాలనూ రెండువర్గాలనూ చీల్చి
ముక్కలుగా మిగిల్చిన వాస్తవం

పరువు ఒక భ్రమ
మరణం ఒక నిజం

మిగిలిందేమిటి..?
ఒక దుఃఖం.. ఒక ఓటమి..

- వారాల ఆనంద్, 9440501281

657
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles