గాలిలో దీపం


Mon,September 17, 2018 12:08 AM

Gaalilo-deepam
ఎవరొచ్చినా రాకపోయినా
నాలుగేండ్ల మన తెలంగాణ బిడ్డను
నాలుగు కాలాలు మనగలగాలని కోరుకుందాం !
నవ్వుతూనో నానుతూనో
మునుగుతూనో తేలుతూనో ప్రయాణం !
కష్టాలను ఈడ్చుకుంటూనో
కన్నీళ్లను తుడుచుకుంటూనో
సంసారాన్ని చక్కదిద్దుకుంటూ వెళ్తుంది
మన సంస్కృతినీ సంప్రదాయాన్నీ
అభిరుచినీ ఆత్మగౌరవాన్నీ వాడి పోకుండా
ప్రాణానికన్న మిన్నగా కాపాడుదాం!
తనయులం తనయులం తన్నుకుంటే
పనిచేయక నాగలి అటకెక్కుతది
తిరుగుతున్న చక్రం పట్టా తప్పుతది
ఇదిచూస్తే ఇరుగుపొరుగువాళ్ళకో ఆటవిడుపు
నవ్వేటోని ముందు బజార్లో జారి పడొద్దు
గుడిసెలో దీపం గాలికి ఆరిపోకుండా
రెండు అరచేతుల్ని బుగ్గను చేసి అడ్డం పెడదాం !
జొన్నమొక్కకు ఇంకా జుట్టు మొలవనేలేదు
కంకికి ఇంకా నూనూగు మీసాలు నల్లబడనేలేదు
చెయ్యెత్తి అడ్డం పెట్టుకొని మొఖమెత్తి చూస్తే
ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న కిరణాల పరిమళాలు
ప్రేయసిలా నాసికాన్ని చుంబించిపోతున్నాయి
తెలంగాణ చిత్రపటాన్ని చింపిన వాళ్ళ
కోటి రత్నాల వీణ తీగల్ని తెంపిన వాళ్ళ
వారసులు తారస్థపడుతున్న సంగతి తెలియంది కాదు
ఎప్పటికీ గుహల్లో పులులు
మాటు వేస్తాయనే విషయం మరిచిపోవద్దు
నేరగాళ్ళను క్రూరమృగాలను
నమ్మకూడదని కదా చెప్పింది చరిత్ర
చాపకిందికి నీళ్ళెప్పుడొస్తాయో తెలియని
అమాయకపు అయోమయస్థితిని అశ్రద్ధ చేసే
ఇన్నాళ్లూ దిక్కు మొక్కు లేక బిక్కు బిక్కు మన్నాం
మన ఎలుక తోకకే నిప్పుపెట్టి
మన ఇల్లునే తగలపెట్టే సంస్కృతి ఇదేం సంస్కృతి ?
నక్కజిత్తుల నయవంచకులను
నమ్మకూడదని కదా చెప్పింది చరిత్ర
చానల్లో నలుగురు నాలుగు రకాల మనుషులు
తలొక వాదనైనా తెలంగాణ గురించే కదా మాట్లాడేది
ఎవ్వరైనా తెలంగాణని నమ్ముకుని బతకండి
అమ్ముకొని కాదు -
ఐదువేళ్ళు వేరైతే అలికిడి
ఒకటిగా ఉండి ముడివేస్తే పిడికిలి!!
- కందుకూరి శ్రీరాములు, 94401 19245

848
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles