పోస్ట్ బాక్స్


Sun,September 2, 2018 11:33 PM

పాత వస్తువే అనుకోకండి
ఇంకా మరపు మడతల్లోకి
అంతర్ధానం కాలేదు.
తుప్పుబట్టి
పెచ్చులూడిపోయి
కాలానికి ఎదురీదే
ప్రాచీన పడవలా వుంది.
రిలయన్స్, ఐడియా
ఈమెయిల్, ఇంటర్‌నెట్
సామూహికంగా
ఇచ్చే షాకుల్ని తట్టుకొని
ఇంకా నిలడే వుంది!
ఆరోజుల్లో
మనం రాసిన ఉత్తరాలను
చదివిందో లేదోగాని
నాటి భావ ప్రకంపనలు
ఇన్నాళ్లూ దానికి
ఆక్సీజన్ ప్రసారం చేసి వుంటాయి!
రూపాయిబిల్లను
చతురస్రంగా మారిస్తే
ఒక స్టాంపు..
అది జవనాశ్వంగా మారి
కన్నీటి మూటలను బట్వాడా చేసేది!
ఇప్పటి పిల్లలకెలా తెలుస్తుంది..
ఒకప్పుడు వాళ్ళ అమ్మానాన్నలు
రాసుకున్న ప్రేమలేఖలు
ఇవాళ వాళ్ల రక్తంలో ప్రవహిస్తున్నాయని
టోపిని కళ్లమీదికి లాక్కొని
సెల్యూట్ చేస్తుంది పోస్ట్‌బాక్స్
నేనైతే.. రెండు చేతులు జోడిస్తున్నాను
నాస్టాల్జియా కాదిది
పోస్టాల్జియా...
- డాక్టర్ ఎన్. గోపి

72
Tags

More News

VIRAL NEWS