నీటి విస్పోటం..


Sun,September 2, 2018 11:33 PM

మబ్బులు ముసుగేసిన వానవాసన
శరీరాన్ని మంచు ముక్కై తగులుతుంది
తొవ్వకడ్డంగా అవ్వనాటిన చెట్టు
పగిలిన తేనె పట్టులా చెదిరిపోతుంది
పొద్దున్నే కాన్వెంటు కుర్రాడిలా ముద్దొచ్చే కొబ్బరి చెట్టు
చింపిరి జుట్టు అనాథలా దీనంగా
నేలతల్లిపై చేష్టలుడిగి ఒరిగిపోతుంది!
రైతు చూపు రాత్రి పూట గబ్బిలమై ఎగిరివచ్చి
మళ్ళీ నిశ్శబ్దపు చెట్టుకు వేళ్ళాడుతుంది
మట్టిపిల్ల తలపై నీటిమైదానపు తట్టలో
ఒడ్లగింజల్ని తెట్టుకట్టిస్తుంది!
అవి ఏ రైతు ఉఛ్వాస,నిశ్వాసలో..
నోటికందాల్సిన పంట కుప్పలు
నీటిపై చెదిరిన కలలై తేలిపోతుంటాయి!
అవి ఏ రైతుల గుండె భాగాలో..
చీల్చుకు పుడుతున్న ఆకలి అగ్నిని తడుపుకోవడానికి
అక్కడక్కడా ఆకాశం నుండి రాలే అన్నం పొట్లాలకై
తలపైకెత్తి పబ్బతి పట్టాలి..
ఆకాశం నిలువునా పలిగి నీటి విస్పోటమైనప్పుడు
జీవం నీటిబుడగలా పేలిపోక తప్పదు!
ఉళ్ళూ ఏర్లు ఒక్కటయ్యే ప్రకృతి అకస్మాత్తు
విలయ తాండవమై
బతుకు పడవను తూట్లు పొడిసి పోతుంది!
సంవత్సరమంతా అన్న ప్రశ్న జెలగై
మెదడులో ప్రవేశిస్తుంది..
కరెంటు కోతతో కాలువలు ఎండితే
కాలం కసిగా ఇప్పుడు ఎండకోతల్తో
వూరంతా నీరు నిండిస్తుంది..!
పొల్లాకు పిట్ట ఇంకా దొరకని ఎండుటాకుల
అన్వేషణలోనే వుంటుంది
చెరువులన్నీ ముల్లెలు ఇప్పినయి
బతుకులన్నీ కాయితం పడవలయినయి...
- సీహెచ్ ఉషారాణి, 94412 28142

500
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles