సిద్ధ పురుషుడు


Mon,August 27, 2018 04:49 AM

నలభై ఏళ్ల క్రితం అతను నగరానికి
Uncrowned kingలా ఉండేవాడు
నగర పరువును ఠీవిగా ఎగరేస్తుండేవాడు
నగర నదిలో పువ్వులపడవై
ప్యాసింజర్ల రథసారథిలా సాగుతూ
స్నేహదీపాలను వెలిగించేవాడు
అతను మీటర్ వేశాడంటే..
చెంగుచెంగున లేడిపిల్లలా పరిగెడుతూ
మనల్ని కలవరపెడుతుండేది
ఏక్ రూపాయ్ జ్యాదా దేవ్ సాబ్..
రిక్వెస్టో.. కమాండో..
పాన్ కలిసిన మాట పరిమళంగా వెలువడుతుండేది
నేలకు కట్టిన పసుపుపచ్చ తోరణాల్లా
మిలమిలాడుతుండేవి నగరమంతా ఆటోలప్పుడు
నగరానికి నటించటం తెలియని కాలమది!
ఇప్పుడు నగరం కాంక్రీట్ వనంకదా
మళ్ళీ అతను కనిపించాడు
కష్టాల కోటు కప్పుకుని
వెలిసిన జీవితాన్ని వెలిగించాలన్న తాపత్రయంతో
ఉదయాన్నే బయల్దేరుతాడు
కాస్త దయను ప్రసాదించమంటూ..
ఇప్పుడతను రాజ్యంపోయిన రాజు
కప్పు చాయ్‌లో ఆశల చక్కెర కలుపుకుని చప్పరిస్తాడు
కాస్త తియ్యటి మనుసులు కనిపిస్తాయేమోనని!
నగిషీల నగరమిప్పుడు
పరాయీకరణ పంజరంలో చిక్కి విలవిల్లాడుతోంది కదా
అస్థిపంజరం లాంటి అతని ఆటోను చూసి
జాలి ప్రకటిస్తోంది
ఎటుచూసినా ప్రపంచీకరణ దుమ్ము
దమ్ము తీసుకోవాలంటే డబ్బు మాస్క్ వేసుకోవాల్సిందే
నువ్వో పురాజ్ఞాపకానివిప్పుడు
నాలాగే అంటు పకపకనవ్వింది
అతను ఎవరైతేనేం ఓ అనామక రాజిప్పుడు
గతం దేహంతో సందేహంగా వర్తమానంలో దిక్కులుచూస్తూ
రోజుచేసే యుద్ధానికి సిద్ధమయ్యే సిద్ధపురుషుడు...
- సి.యస్.రాంబాబు, 94904 01005
(ఆటో నడుపుతున్న ఓ పెద్దాయనను చూసినప్పుడు..)

551
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles