వినిపించిందా..?


Mon,August 27, 2018 04:49 AM

నిన్నటి రాత్రి
చీకటి గొడుగు కింద అడవి పాట
విందామని వెళ్ళాను..
అడవిని రెండుగా చీల్చిన దారి
ఆకుపచ్చని సొరంగాన్ని
తవ్వుకుంది
రాలుతున్న మబ్బు తునకలు
తడి చేసి పోతున్నాయి
నెర్రెల్ని, నన్నూ..
నాలుగు అడుగులు వేసి
ఆకాశానికి సాగి
పాడుతున్న అడవిని చూసాను
అది సన్నని పిల్ల కొమ్మల ఈల
పాటలా లేదు..
అటు వైపు చిమ్మ చీకటిలో గొడ్డళ్ల మంద
దారి మీద నిన్న నవ్విన మర్రిమాను శవం
ఆ పక్కనే ముక్కలైన వేపతల్లి
హతమైన చెట్టు మీద చెదిరిన
గూళ్ళతో బెదిరిన పిట్టల
మూలుగులు నిశ్శబ్దాన్ని శపిస్తున్నాయి..!
కాళ్ళను నరుక్కుంటున్న
మనుషుల్ని చూసి నేను
సొమ్మసిల్లాను
పారిపోలేని పచ్చనమ్మ చెప్పే వీడ్కోలు మాట
గొడ్డలి అంచుకు వినిపించిందో లేదో
నీకేమైనా వినిపించిందా...?
- దేవనపల్లి వీణావాణి, 99513 31122

515
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles