అమ్మకుట్టి


Mon,August 27, 2018 04:49 AM

ఎవలను నిందించి ఏం లాభం..?
అమ్మకుట్టి ఆగం మీనుంది
తలో చెయ్యేసి ఆదుకోవాలె
గండం గట్టెక్కినంక తీరిపార మాట్లడుకోవచ్చు
ఉన్నోనికి యియ్యదరియ్యదు
దాన కర్ణులకు చెయ్యిదూగదు
ఏవన్న కానీ..
ఈ నెల పింఛను రాలేదనుకుంట
యిన్నవానయ్య..
పొలం మడిల ఓ మసాలబత్త తక్కువెయ్యి
ఎంత పండితె అంతే ఆయే
పొల్లను సూస్కుంట సంపుకుంటమా
బిడ్డా.. అన్నకు ర్యాకలు కట్ట రాననేవు
వచ్చే పండుగకు ఆయిమన్న చీరదీస్కుంట
భూమ్మీద పడ్డంక బంధాలు ముఖ్యం బిడ్డా..
వారీ పర్శరాములూ..
దంటగాండ్లతోటి అవారాగ తిరిగితె ఏమొత్తదిరా
చందాలన్న వసూలు చేసిపంపు
జప్పున కొలువన్న దొరుకుతది..
మా అమ్మవు కదూ..నీ బాంచెను
ఈ ఒక్కపాలి నీ గళ్ళగురిగిల పైసలియ్యి
అమ్మకుట్టి.. ఆయిపాయెన్నట్టుంది
కూలి పైసలు రాంగనే
నువ్వన్న బట్టలు కొనిత్త..
వానపాడుగాను.. తెరిపిత్తలేదు..
వరదంటె ఎరుగని పొల్ల
నిద్రాగారం లేక బురుదల నాని
కాళ్ళు రెక్కలు చెడుతున్నవి
అమ్మకుట్టి ఎట్ల కోలుకుంటదో
తల్సుకుంటెనే పానం దస్సుమంటాంది..
- వడ్లకొండ దయాకర్
94404 27968
(కేరళ వరద బాధితుల గోస తల్సుకొని..)

269
Tags

More News

VIRAL NEWS