కార్లోస్ డ్రమ్మాండ్


Mon,August 27, 2018 04:48 AM

(1902, అక్టోబర్ 31- 1987, ఆగస్టు 17)
Carlos-Drummond
బ్రెజిల్ దేశంలో ఆధునిక సాహితీ విప్లవానికి ఆద్యుడిగా పేరుపొందిన కార్లోస్ డ్రంమాండ్ డి ఆండ్రెడి విద్యార్థి దశలోనే ధిక్కార స్వరాన్ని వినిపించినందుకు గాను తాను చదువుతున్న కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వాధికారిగా విద్యాశాఖలోనూ, చరిత్ర-వారసత్వ శాఖలో సేవలందించిన ఆయన, 20వ శతాబ్ద పు బ్రెజిల్ సాహితీ ప్రస్థానానికి చుక్కానిగా నిలిచాడు. సమకాలీన ప్రాపంచిక రాజకీయ, వైయక్తిక , సామాజిక జీవన సంఘర్షణలను వస్తువుగా ఎంచుకొని, సామూహిక తాత్త్విక కోణంలోంచి ఆయన సృష్టించిన కవితా ప్రతీకలు, తర్వాతి తరం సాహితీకారులకు దీపస్తంభంలా నిలిచాయి. కవిగా, అనువాదకుడిగా, నవలా రచయితగా, పత్రికల్లో కాలమిస్ట్‌గా, బాలసాహితీ వేత్తగా, దార్శనికుడిగా రియో డి జెనీరో వేదిక నుంచి ఆయన చేసిన వేలాది రచనలు నూతన ప్రపంచాన్ని అక్షరాలతో సాక్షాత్కరింపజేశాయి. ఆయన కవితా ప్రభావం ఎంతవరకు వెళ్లిందంటే, ఆ దేశ కరెన్సీ నోటుపై ఆయన రాసిన Cancao Amiga (Friendly Song)లోని కవితా పంక్తులను ముద్రించేంత!
ఆయన రచనల్లో Alguma Poesia (Some Poetry-1930), Sentimento do Mundo (The feeling of the world-1940), Jose (1942), A Rosa do Povo (The People s Rose- 1942), Nudez (Nudity- 1968), A Visita (The Visit-1977), A Maquina do Mundo (The Worlds Ma chine) వంటి కావ్యాలు పోర్చుగీసు భాషా కవిత్వాన్ని సుసంపన్నం చేశాయి. అందుకే ఆయన- లాటిన్ అమెరికాలో స్వదేశీ జీవన గీతిక! బ్రెజిల్ దేశ సాంస్కృతిక పతాక!పోర్చుగీసు అక్షర మాలిక!!

నాలుగు స్తంభాలాట!

కొన్ని యుగాల పూర్వం-
తెరిసాను జోవా ప్రేమించాడు
ఆమె మాత్రం రైముండోను ఇష్టపడింది
అతనేమో మారియా పట్ల అనురాగంతో ఉన్నాడు
కానీ ఆమె,
జొక్వీమ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది
ఇక, జొక్వీమ్ లిలీపై ఆరాధనతో ఉండేవాడు
అయితే, లిలీ మాత్రం ఎవరినీ ప్రేమించలేదు!
యుగానంతరం-
జోవా అమెరికాకు చెక్కేసాడు
తెరెసా సన్యాసినిగా మారి ఆశ్రమంలో చేరింది
ఒక ఘోర ప్రమాదంలో రైముండో మరణించాడు
పనిమనిషిగానే మారియా ముసలిదైపోయింది
జొక్వీమ్ ఆత్మహత్య చేసుకొని
తనకుతాను చరమగీతం పాడుకున్నాడు
ఇక, లిలీ మాత్రమే
ఫెర్నాండెజ్ పింటోను పెళ్లి చేసుకుంది!
ఒక చిత్రాన్ని గమనించారా?
ఈ కథ మొదట్లో అసలు
ఫెర్నాండెజ్ పింటో లేనే లేడు!!
మూలం: కార్లోస్ డ్రమ్మాండ్ డి ఆండ్రెడి
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

674
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles