కాలం వాలిపోతున్న వైపు


Mon,August 20, 2018 01:31 AM

Kaalam
కాలం వాలిపోతున్న వైపు
నువ్వు చూపు సారించు
ఇరుదేహాల మధ్య
ఒకే సామిప్యం
ఒకే ఏకాంతం
ఒకే నిశ్శబ్ద సామూహిక మూల్గుల రొద
తూర్పు నుంచి పశ్చిమానికి
ముదుసలి కాలినడక
వడిగా
అలజడిగా
దైన్యంగా
వాలిన పొద్దుకౌగిట ఉదయాన్ని
మళ్లీ మళ్లీ
నెరిసిన వెంట్రుకలంత వయసుతో
స్వప్నిస్తూ స్వచ్ఛంగా
కాలం కురచవుతుంటే
మనిషి దేహం ముడుచుకొస్తుంటే
గుమ్మాల దగ్గర
మనల్ని మెత్తగా తడిమి తీసుకెళ్లే చేతుల కోసం
అనైపుణ్య జాలరి ఆట
వర్షం లోపల
వర్షం బయట
సమాధి చేయాల్సిన గతాన్ని
మరుభూమికి చేర్చలేనంత నిస్సహాయతతో
వర్షం నీలిదేహపు పడవ
ఎంతటి ఆశ
ముడుచుకుపోయే దేహానికి
ముడతలు పడ్డ ఇంటికి
దొంగిలించిన రెండు కిరణాల్ని
జేబులో పెట్టుకుని దారంతో కుట్టేస్తూ
ఉదయానికి విత్తనాన్ని నాటాలనే ఆశ
కరచాలనాల మధ్య
మృత్యువు లీలగా నవ్వేప్పుడు
చాచిన కాళ్లపైనుంచి
కాలం ఎండుటాకుల్లా రాలిపోతున్నప్పుడు
ఓ ఋతువు
కొత్తగా పచ్చబొట్టు పొడుసుకుంటూ చేసే దువా
అల్లా...
ఇక్కడ జీవితం
ఒక గుమ్మంలేని ఇళ్లదారిలేక
అడుగువేయలేని
నీళ్లు నిండిన ఖాళీ హస్తం.
- మెర్సీ మార్గరెట్, 90528 09952

284
Tags

More News

VIRAL NEWS