హలో మీరు బాగున్నారా?


Mon,August 20, 2018 01:31 AM

ఇప్పుడు వాళ్ళున్న స్థితిలో
తట్టుకోలేని భీతి ఒక్కటే..
చనిపోవడం!
కనీసం వాళ్ళు
నట్ట నడి వీధిలో లేరు
చాలా సురక్షితంగా, భద్రంగా గదుల్లో ఉన్నారు
కాకపోతే ఒంటరిగా టీవీలకు అతుక్కుపోయి
పాలిపోయిన ముఖాలతో
జీవితాలను డబ్బాల్లోకి కుదించేసుకొని
సొట్టపోయిన వంకర టింకర నవ్వులతో ఉన్నారు
వారి పొరుగుతనం ఎంతో ఆదర్శవంతం
అది వారి ప్రతీ పనిలో ప్రస్ఫుటం
వాహనాలను పార్క్ చేసిన రీతిలో
పచ్చిక బయళ్లను సతతం హరితంగా ఉంచుకున్న తీరులో
చిన్న గదులను సైతం అలంకరించిన విధానంలో..
సెలవు రోజుల్లో
వారి బంధువుల రాకపోకల సందర్భంలో
ఇంటి తలుపులు
తెరుచుకుంటూ మూసుకుంటూన్న క్షణాలలో..
అయితే ఒక్కోసారి వారి ఇంటి తలుపులు మూసుకుంటాయి
ఎవరైతే అంతిమ ఘడియలలో
మరణానికి సమీపంగా ఉంటారో
వారి విషయంలో తలుపులు మూసుకుంటాయి
నీ పొరుగుతనపు సగటు ప్రశాంత సమయంలో
మెల్లగా జీరాడే గాలివీధుల్లో
మరణానికి ఆసన్నమవుతూ
ఇంకా సజీవంగా ఉంటారో
వారి కోసం తలుపులు మూసుకునే ఉంటాయి
ఎవరైతే ఓ మహా విషాదానికి- ఓ భారీ సందిగ్ధతకు
ఓ బీభత్సానికి- ఓ భయానికి
ఓ అజ్ఞానానికి సాక్షిగా నిలుస్తారో
వారికి తలుపులు మూసుకునే ఉంటాయి
ఆ క్షణం-
కంచెకు ఆవల నిలబడి
ఓ కుక్క బిత్తర చూపులు చూస్తుంది
కిటికీ చెంత ఓ మనిషి
నిశ్శబ్దాన్నే నివాళిగా గానం చేస్తూ ఉంటాడు!
మూలం: ఛార్లెస్ బుకోవ్ స్కీ
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

299
Tags

More News

VIRAL NEWS