ప్రపంచ కవిత


Sun,August 12, 2018 11:34 PM

అయ్
(1947, అక్టోబర్ 21- 2010, మార్చి 20)

image
తనని తాను 1/2 జపనీస్ గా , 1/8 చాక్టా-చికాసా జాతిగా 1/4 నల్లజాతి వనితగా అభివర్ణించుకున్న ఈ అమెరికన్ కవయిత్రి అసలు పేరు ఫ్లోరెన్స్ ఆంథోనీ! చాలా ఏండ్ల వరకు తన తండ్రి ఎవరో తెలీకుం డా పెరిగిన ఆమె, తన తండ్రి ఓ జపాన్ దేశీయుడని తెలుసుకున్న తర్వాత తన పేరును అయ్‌గా మార్చుకున్నది. జపాన్ భాషలో దీన ర్థం ప్రేమ! 19వ శతాబ్దంలో రాబర్ట్ బ్రౌనింగ్ ప్రచారంలోకి తెచ్చి న Dramatic Monologue ప్రక్రియకి సమకాలీన సంవేదనలను జోడించి కవిత్వాన్ని రాసిన ఆమె, Cruelty (1973), Kill -ing Floor (1979), Sin (1986), Fate (1991), Greed (1993),, Dread (2003) వంటి కావ్యాలను ప్రచురించింది. 1999లో Vice కవితా సంకలనానికి ప్రతిష్టాత్మక నేషనల్ బుక్ అవార్డును, మరెన్నో పురస్కారాలను అందుకున్నది.

సంభాషణ!
మనం ఒకరినొకరు చూసుకొని చిరునవ్వుకుంటాం
చువ్వలతో అల్లిన సోఫాకి అభిముఖంగా
నేను వెనక్కి వాలుతాను
మరణించడమనేది ఎలా ఉంటుంది? నేనంటాను
నీ నీలి వ్రేళ్ళతో నా మోకాళ్ళని స్పృశిస్తావు
ఏదో చెప్పడానికి నువ్వు నోరు తెరిచిన మరుక్షణం
ఓ పసుపు పచ్చ కాంతి బంతి దొర్లిపడి
నేల పై మంటలతో అగాథాన్ని సృష్టిస్తుంది
నాకేమీ చెప్పకు, నేనంటాను,
నేనేమీ వినదల్చుకోలేదు
నువ్వు ఎప్పుడైనా, యాదృచ్ఛికంగానైనా, అనుకోకుండానైనా
ఒకలాంటి గమ్మత్తయిన దుస్తులను ధరించావా?
అలా అయితే...
నీ గమనింపు లేకుండానే అప్రయత్నంగానే
నీ చేతివ్రేళ్ళు ఆ దుస్తులను తడుముతాయి
అనాలోచితంగానే నువ్వు
కాగితాన్ని కత్తిరిస్తున్న కత్తి సవ్వడిని వింటావు
నువ్వు చూస్తావు కూడా
అప్పుడు నీకు తెలిసొస్తుంది
ఆ దృశ్యం మరో దృశ్యానికి కొనసాగింపు అని
నీ సొంత జీవితం ఓ మాటల సంకెల అని
ఒకానొకరోజు అది దుర్భర ధ్వని అవుతుందని...!
నువ్వెన్నో మాటలు చెప్తావు
అమ్మాయిలెందరో వృత్తాకారంలో
చేతులు కలిపి హారంలా నిలబడి ఉంటారు
హీలియం నింపిన ధవళ బెలూన్ లలాగా
వారివారి మత సంప్రదాయ వస్ర్తాలలో..
వారి తలలపై అలంకారాలుగా పూల కిరీటాలు
అవి అలవోకగా జారిపడుతుంటాయి
వారు మాత్రం
స్వర్గలోకం దిశగా పయనించడానికి సమాయత్తమౌతూ..
అయితే, వీటన్నింటికీ అతీతంగా, ఎగువగా
నేను ఏ అనామక లోకంలోకో తేలిపోతూ ఎగిరెళ్ళుతుంటాను
అది ఎలా ఉంటుందంటే
విహార యానంలోని అమ్మాయిల కన్నా
పది రెట్లు స్పష్టంగా
పది రెట్లు భారంగా...
ఇప్పుడు చెప్పు-
ఈ ప్రపంచంలో బతికిన ఏ ఒక్కడైనా
ఇలాంటి జీవితాన్ని తట్టుకుని గెలిచి ఉంటాడా?
-మూలం: అయ్
-స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

157
Tags

More News

VIRAL NEWS