కవులు మరణించినపుడు..


Mon,August 6, 2018 01:25 AM

కవులు అకాలంగా కాలం చేసినపుడు ఒకసారి
తల పైకెత్తి ఆకాశం వైపు చూడండి
కాంతితో లోకాన్ని వెలిగించాలని కలగన్న
నక్షత్రాలు కొన్ని విషాదంతో
నేలపై కూలే దృశ్యం కనిపించవచ్చు !
మనుషులు విద్వేషాల అగ్ని కీలల్లో
ముక్కలు ముక్కలుగా రాలి పడుతున్నపుడు
కాసిని కవితా వాక్యాల వర్షంతో
మనుషుల్ని బయట పడేయాలని
ఆశపడే అమాయకులు కవులు!
చీకటితో మూసుకుపోయిన
మనుషుల లోపలి లోకాల లోకి
కొంచెం వెలుగుని ప్రసరింపజేసి
మనిషికీ మనిషికీ నడుమ వంతెనలు కట్టి
లోకాన్ని వెలిగించాలనుకుంటారు కవులు !
మనుషులు మరీచికల వెంట
వెర్రి ఆవేశంతో జీవితకాలం పరుగెత్తుతున్నపుడు
ఒయాసిస్సు దగ్గర నిలబడి
ప్రేమ గీతాలతో అందరినీ అక్కున చేర్చుకునే
మానవ ప్రేమికులు కవులు !
మనుషులు నాలుగు గోడల
అగ్గిపెట్టె గూళ్ళల్లో మగ్గిపోయి
శ్వాస అందక సతమతమవుతున్నపుడు
సంచార స్వేచ్ఛాగీతాలతో
ప్రాణవాయువు అందించే కవులు !
ఒక్కోసారి..
అగ్ని కీలల నుండి మనుషుల్ని
బయట పడవేయలేకపోతున్న
వర్షపు చినుకుల్ని దోసిట్లోకి తీసుకుని దుఃఖించే కవులు!
మనుషుల నడుమ కూలుతున్న
వంతెనలను చూసి భోరుమనే కవులు
స్పందనలు మరిచిన రోగిష్టి లోకాన్ని చూడలేక
మధుపాత్రల లోనో పొగల మేఘాల లోనో
మునిగిపోయి, మాయమైపోయే కవులు!
చివరాఖరుకి..
అక్కున చేర్చుకునే మనుషులు కానరాక
ఊపిరాడని ఉక్కిరిబిక్కిరిలో
అకాలంగా నిష్క్రమించే కవులు!
అకాలంగా కవులు మరణించినపుడు
ఒకసారి నేలపై ప్రేమగా చూడండి
కవులు వర్షించి వెళ్ళిన పద్యాలు
మీ జీవితాలకు కొత్త పరిమళం అద్దుతాయేమో..!
- కోడూరి విజయకుమార్, 83309 54074

299
Tags

More News

VIRAL NEWS