కావ్య కళ!


Mon,August 6, 2018 01:24 AM

నీ ప్రతీ కవితనీ రాయి
అదే నీ ఆఖరి వాక్యం అని నమ్ము !
ఈ శతాబ్దం యావత్తూ
ఎర్ర వెలుగును నిలువెల్లా కట్టుకుంది
స్ట్రాన్షియం మంటల నుంచి పుట్టిన జ్వాల అది
తీవ్రవాదాన్ని ఆవాహన చేసుకొని ఉంది
సూపర్ సోనిక్ వేగంతో ఎగిరెళ్తూంది
మృత్యువు కూడా అంతే
అకస్మాత్తుగా ఏ దిక్కునుండో
బీభత్స రూపంతో ప్రత్యక్షమవుతుంది
అది జరుగడానికన్నా ముందే-
ఉరి తీయడానికి ముందరి/ చిట్టచివరి లేఖలాగా
నీ ప్రతి మాటని జాగ్రత్తగా పంపించు
జైలు గోడలపై నీ నినాదాన్ని చెక్కు
ఇప్పుడిక, / విరామం తీసుకోవడానికి నీకు హక్కు లేదు
చిన్నారి పొన్నారి ఆటలాడటానికీ నీకు హక్కు లేదు
నీ తప్పులను నువ్వు సరిదిద్దుకోవడానికి
అసలు సమయమే లేదు.
అందుకే/ నీ ప్రతీ కవితనీ రాయి
సంక్షిప్తంగా, నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా
రక్తంతో.. స్వేదంతో.. కన్నీళ్లతో..
బహుశా అదే నీ ఆఖరి వాక్యం అని అనుకొని రాయి !
నువ్వు నిటారుగా నిలిచినంత వరకు ... !
ఆనందాన్ని/ క్షణకాలమైనా మరిచిపోకు!
గొడ్డలి వేటుకు/ మోకాళ్ళకంటా కూలిపోతున్న నిమిషాన
మేధోవృక్షాల గుసగుసల ఆలాపన.
సంతోషాన్ని/ లిప్త సమయమైనా విస్మరించకు !
నువ్వు నిటారుగా నిలిచినంత కాలం
నువ్వు గాలితో పోరాడినంతకాలం
నువ్వు శిఖరాలని శ్వాసిస్తున్నంత కాలం
గండ్ర గొడ్డలి నిద్రాణమై ఉన్నంత కాలం..
మూలం: బ్లాగా డిమిట్రోవా
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

681
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles