మెతుకు సీమ మెడలో ప్యార్‌కా అక్షరం


Sun,July 29, 2018 11:28 PM

వచనం, గేయం, పద్యం, మూడింటినీ కలుపుకొని, ఒక త్రివేణీ సంగమంలా కర్తాకర్మక్రియల తోటి వాక్యంలా కావ్యరచన చేయడలో చేయడంలో దిట్టగా పరిచితులు ప్యారక. సామాజిక నేపథ్యంలో దూసుకువచ్చిన కవిత వ్యాకరణ తోరణం ద్రుతంగా మాఱ కు అచ్చులు శ్రమజీవులని, హల్లులు పరాన్న భుక్కులైన ధనికులని మార్క్స్ దృక్పథాన్ని వ్యాకరణ తోరణంలో చిత్రించారు.
pyaraka
కటి నక్షత్రాలు విస్మరించలేరు/సమాజంలోని చీకటిని/సారస్వత నక్షత్రాలు తగ్గిస్తాయి/ రాగల సమాజ చైతన్యానికి/కాగల విప్లవ సారస్వతం కోడికూత.. అని ప్రకటించిన సుకవి ప్యారక శేషాచార్యులు. సమాజ స్థితిగతులను, అల్లాడిపోయే పేదవాడి ఆకలిమంటలను, రైతన్న శ్రామిక సౌందర్యాన్ని, కార్మిక స్వేదజలపు శ్రామికతను, మట్టివాసనల సుగంధాన్ని సమకాలీన సామాజిక ఇతివృత్తాలకు అందించిన కవిజీవుడతను. నన్నయలోని ప్రసన్నకథ, తిక్కన నాటకీయ శిల్పము, పోతన పదలాలత్య మకరందాల పద్యకుసుమాల గుబాళింపులు, చేమకూర వేంకట కవి ప్రబంధ కవితా పద్య చమత్కృతి, శ్రీనాథుని ప్రౌఢ కవితా గంభీరత, విశ్వనాథుని నిబద్ధత, రాయప్రోలు మాధుర్యము, కరుణశ్రీ హృద్యమైన కారుణ్యంలో కలగలిపిన కరుణ రస మేళవింపు, శ్రీశ్రీ యుగ కర్తృత్వం, దిగంబరుల తిరుగుబాటు, దాశరథి దార్శనికత, కాళోజీ ప్రజల గొడవ, పురాణ ప్రాతల సజీవ చ్రితణ, ఇతిహాసాల హాసము తొణికిసలాడు రచనా వైచిత్రి గల కవిపండితుడు ప్యారక శేషాచార్యులు. ఆధునికతలో హేతువాదం, సంప్రదాయంలో మానవతావాదం మేళవింపు కవిగా తెలంగాణలో తరం నుంచి తరానికి వారధి కట్టిన ఎంతోమంది కవికేసరుల సహచర్యమే కాదు, సమ్మిళిత రచనా వ్యాసాంగాన్ని సొంతం చేసుకున్నవారిగా తనకంటూ ప్రత్యేకతను తన రచనల్లో, జీవితాచరణగా అక్షరసాగు చేసిన వారు శేషాచార్యులు.

మెతుకు సీమ సాహితీ జగత్తులో మెరిసిన అక్షర కెరటం ఆయన. పాల్కురికి సోమన వీరశైవ ప్రభావ వైచిత్రితో కూడిన శివభక్తుల గాథలు, నన్నెచోడుని మార్గదేశీ కవిత, శ్రీనాథుని కవితా ప్రౌడి, అష్టదిగ్గజ కవుల ప్రబంధ కావ్యకుసుమాలు, చిత్ర కవి, ఉదాహరణలు, పద కవితలు, ప్రణయ కవిత్వం, ప్రకృతి కవిత్వం, అమలిన శృంగారం, దిగంబర కవిత్వం, అభ్యుదయ కవిత్వం, చేతనావర్తనం, స్త్రీవాద కవిత్వం, విప్లవ కవిత్వం, దళితవాద కవి త్వం, తెలంగాణ ఉద్యమ కవిత్వం, వచన కవిత్వం, గేయ కవిత్వం, కావ్యాలు, నాటకాలు, కథానికలు, విమర్శలు, పరిశోధనలు, వ్యాసాలు, పేరడీలు ఇలా అనేక ప్రక్రియల్లో ఆరితేరిన కలం ఆయన. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సకల జనులను ఏకం చేసిన ఉద్యమనాయకుడు కేసీఆర్ కార్యశీలతను తనదైన శైలిలో కవనం చేసిన కవి అతడు. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ మహాసభలు జరిగాయి. ప్యారక లోగడ వెరువరించిన ప్రపత్తి నిర్వేదం పద్యకావ్య స్థితిగతులకు మారుతున్న తెలంగాణ వ్యవసాయపు ముఖచిత్ర సోయగంపై మురిసిపోతారు. ప్రపత్తి నిర్వేదం సామాజిక స్పృహ, ఆధునిక సారళ్యం గొన్న రచన. తెలంగాణ మాండలికపు మాధుర్యం, ప్రజల నాలుకలమీద నాట్యమాడే పదసంపదను తన రచనల్లో ఇనుమడింపజేసి ఇగురంగా, హృద్యంగా వివరించడంలో ప్యారకది ప్రత్యేక ముద్ర. మోసములేని సేవనము పూని యొవర్చి తివేని నీవునా అను పద్యము ద్వారా ఎటువంటి మోసములేని సేవలెన్నో చేశాను. ఇప్పుడు నా కోసం పత్తి రైతుపై ప్రేమను పెంచుకొనుము. రాబోయే రోజులలో ప్రభుత్వ సహాయ రూపములో కష్టపడే రైతన్నకు సహాయమునందించుము అని వేడుకుంటుంది.

చిత్రమేమిటంటే ఆ పత్తిమొరే కేసీఆర్ గారి రూపంలో కరుణత రూపుగట్టి రైతుబంధు పథకము రూపములో ఆశ్రయము కలిగిస్తున్నది. స్వర్ణోత్సవమై కర్షక అను పద్యము ద్వారా భవిష్యత్తు స్వర్ణయుగము కావాలని రైతు అత్యంత ఉత్సాహుతో పొలాన్ని పచ్చగా పండించాలని అన్ని వర్ణాల వారు అన్నదమ్ముల వలె పూర్ణత్వము నందిన బంగారు తెలంగాణగా రూపుదాల్చాలని బలీయంగా భావించాడు. స్వరాష్ట్రంలో సగర్వంగా రైతన్న తన క్షేత్రాన్ని ఆకుపచ్చగా రూపుదిద్దుకుంటున్న తీరుపై శేషాచార్యులు అమితానందపడుతున్నాడు. మెతుకు సీమ కవుల ఇతిహాస ప్రయుక్తమైన సంప్రదాయం వారి శ్వాస. నియమాల విలువలు వారి నడత. ప్యారక శేషాచార్యులు మెదక్ జిల్లా కవి. మెతక తనమున్న కవినని కాకతాళీయములో మెతుకు బాటు ఖండికలో చెప్పుకుంటాడు. కాకికి దొడ్డ పుల్లల గూడు ఉంటుందని తన కవిత్వానికి ఆ దొడ్డతనము, ఆ గిరుసుబాటు తనము ఉందేమో! అని తనను తాను ఆవిష్కరించుకున్నారు. తన 16వ యేట నుంచే కవిత్వాన్ని రాయడం ప్రారంభించిన కవి శేషాచార్యులు. మెదక్ జిల్లా నర్సాపురం తాలూకా శివంపేట ప్యారక శేషాచార్యుల జన్మస్థలం. ఆ ఊరు పండితుల కూడలి. మేధావు ల రచ్చబండ. పదెనుక్కిన రాజకీయ కూడలి. ధార్మిక కార్యక్రమాలకు కొండ. రజాకార్ల నీలి నీడలు, జమిందారీ,పెత్తందారీ ఇజాన్ని ప్రతిబింబించే చారిత్రకత ఆ ఊరిలో ఒకప్పుడు కనిపించేవి. పబ్బా అంజయ్యశెట్టి ప్రతి సంవత్సరము గీతా జయంతులు, రుద్రయాగాలు చేసేవారు. ఎక్కడెక్కడి నుంచో పండితులు వచ్చేవారు. పురాణాలు, హరికథలు, బుర్రకథలు, చిరుతలు, శారదకాండ్రు, చర్చలు వాదోపవాదాలు ఆయన చిన్నతనంలో జరిగేవి. వీటి నేపథ్యంలో శేషాచార్యులు బాల్యం గడిచింది. ప్యారక రచనా చమత్కృతికి కావ్య లక్షణ సమన్వితమైన ప్రతిభావ్యుత్పత్తి, అభ్యాసాలు ఆధారభూతాలైనాయి.

సముద్రాల వేంకటాచార్యులు వీరి మేనమామ. శాస్ర్తుల విశ్వనాథ శర్మ ఆ సేతు హిమాచల పర్యంతము పేరు పడ్డ పండితుడు ఆయన. ఆ ఊరివాడు పొడిచేటి వెంకట నరసింహాచార్యులు. వీళ్లందరూ ఆ గ్రామం తీర్చిదిద్దిన పండితులు. అటువంటి వాతావరణములో పెరిగిన వాడు ప్యారక శేషాచార్యులు. 1960లో ఆకాశవాణి నిర్వహించిన బాల కవుల ప్రస్తానంతో శేషాచార్యుల సాహిత్య జీవనం ప్రారంభమైంది. ఆ పరంపరలో 1.మాతృశ్రీ 2.గురూపదేశము 3.శిఖిముఖాలు 4.ఏకలవ్య సామాజిక దృక్కోణం గల పౌరాణిక నాటకం 5.సమాజం.. ఆధునిక అలజడుల సాంఘీక ఏకాంకిక నాటకం 6.ప్రపత్తి నిర్వేదము 7.ప్లేటో వాల్మికీయం 8.కాకతాళీయం 9.శృంగార గంగ 10.శృంగార వాసంతం (సీరియల్ కథలు) మొదలైనవి తన అక్షరసాగుకు ఆణిముత్యపు దర్పణాలు. ఇవే కాకుండా విశ్వామ్రితులు అనే నవల, భక్తదృవ తన పదహారేళ్ల ప్రాయంలో రాసిన చిన్న నాటిక. అభినవ కుచేల కుటుంబ నియంత్రణపై ఏకాంకిక. ఎన్నో వ్యాసాలు, కథలు, కవితలు, స్కెచ్‌లు పత్రికలలో వచ్చాయి. అవధానంలో చమక్కులు అనే శీర్షికన ఉజ్వల మాస పత్రికలో ధారావాహికంగా వివిధ అవధాన కవులను లబ్ధప్రతిష్టులయిన ఎంతోమందిని పాఠకులకు పరిచయం చేశారు. ప్యారక శేషాచార్యుల కాకతాళీయం గురించి తెలుగునాట విస్తృత చర్చ జరిగింది. సాధారణంగా అయితే జన వ్యవహారంలో కాకతాళీయం అంటే అనుకోకుండా వచ్చే అవకాశం అని అర్థం. కానీ ప్యారక కాక అనగా కాకి, తాళీయం అనగా తాళికట్టుట అంటే కాకిపెండ్లి అని అర్థంలో ఆయన చేసిన పద్యరచనా వచనా ప్రయోగం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. ప్యారక అంటే ప్రేమకవి అని అర్థం.

తల్లిమీద అవ్యాజమైన ప్రేమకు ప్రతీకగా వెలువడిన కావ్యము కాకతాళీయం. తాను కష్టపుడుతూ పదిమంది కాకులను చేరదీసే తత్వము కాకిది. తనకు కనబడిన ఆహారము తానొక్కటే తినక తోటి కాకులకు తినిపించాలనే ఉదారబుద్ధి కలది. ఈ బుద్దే ఈ మానవునికి ఉంటే ప్రపంచమంతా వసుదైక కుటుంబము కాదా! అని కాకి ప్రపంచపు హితవును కాంక్షిస్తుంది. ననునేదో యొక భావనా తఱగ శూన్యభౌ మనోవిధిలూ అను పద్యంలో కాకియే కవిగా, కవియే కాకిగా తలపోసాడు. మెతుకు బాటలో కవి మెదకులోని ఎన్నో ప్రదేవాల ప్రాశస్థ్యాన్ని తెలియజేస్తాడు. పుట్టపర్తి నారాయణాచార్యులు, మధునావంతుల సత్యనారాయణ శాస్ర్తుల మాదిరి స్థల పురాణం చెప్పినవారు ప్యారక శేషాచార్యులు. మనిషి మనీషిగా మారితే దేశం రామరాజ్యంగా బాసిల్లుతుంది అని పేర్కొంటూనే ఈనాటి మేటి మీడియా చమక్కు జమక్కులు మితిమీరిన ప్రదర్శనలపై ధర్మాగ్రహాన్ని కూడా ప్రకటించారు. తన్ను తిట్టుడు కొట్టు తత్వాలు వెల్లువై/ మీడియాలో మితిమీరి పోయే అను పద్యములో మీడియా అన్ని విషయాల పట్ల అతి దూకుడు తెగింపు, వెకిలి తనపు జాడల్ని తనదైన శైలిలో ఆవిష్కరించారు. వచనం, గేయం, పద్యం, మూడింటినీ కలుపుకొని, ఒక త్రివేణీ సంగమంలా కర్తాకర్మక్రియల తోటి వాక్యంలా కావ్యరచన చేయడలో చేయడంలో దిట్టగా పరిచితులు ప్యార క. సామాజిక నేపథ్యంలో దూసుకువచ్చిన కవిత వ్యాకరణ తోరణం ద్రుతంగా మాఱ కు అచ్చులు శ్రమజీవులని, హల్లులు పరాన్న భుక్కులైన ధనికులని మార్క్స్ దృక్పథాన్ని వ్యాకరణ తోరణంలో చిత్రించారు.
- చెరుకుపల్లి వేంకటశేషాచారి, 90598 43911
(తెలుగు పండిత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చింతల్, వరంగల్)

1221
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles