తొణకని కవి కోట్ల


Sun,July 29, 2018 11:28 PM

kotla
కోట్ల వేంకటేశ్వరరెడ్డి ఇవాళ్టి కవి. అంటే నిన్ని వ్వాళ కలం పట్టిన కవి అని కాదు. ప్రతి సామాజిక ఘటనకూ వెంటనే స్పందించే సమకాలీన కవి అని అర్థం. అన్నట్టు ఇతని కవిత్వం వయస్సు మూడు దశాబ్దాలు. అనవరశం కవిత్వాన్ని శ్వాసించే ఈ పాలమూరు బిడ్డ ఇప్పటికే తొమ్మిది కవిత్వ గ్రంథాలు రచించి తన సత్తా చాటుకున్నాడు. తొలిసంపుటి గుండెకింద తడి దగ్గరి నుంచి రహస్యాలు లేని వాళ్లు, రంగు వెలసిన జెండా, నాన్నా నాలా ఎదుగు (దీర్ఘకవిత), మనిషెల్లి పోతుండు, బ్రేకింగ్ న్యూస్ అలాగే ఇప్పటి తొణకని వాక్యం దాకా ఎత్తిన కలం దించని నిరంతర కవి. అన్నట్టు కోట్ల నూరు తెలం గాణ నానీలు, నిషేధానంతర నానీలు అంటూ రెండు నానీ సంపుటాలు కూడా వెలువరించాడు. కోట్ల రచనల్లో దేనికదే ఓ ఆణిముత్యం. పుస్తకం వచ్చిన రెండు మూడేండ్ల దాకా దాని పేరుతో చెలామణి అయ్యే గట్టికవి.
పాలమూరి వలసలు,తెలంగాణ ఉద్య మ స్ఫూర్తి, రైతుల పట్ల విలవిల, బడుగు ల పక్షాన నిలబడే గుండె కింది ఆర్ద్రతా, అన్యాయాల పట్ల మానవాగ్రహం వంటి భావాలు కోట్ల కవిత్వంలో పదునుదేరి కనిపిస్తాయి. ఒక రకంగా కోట్లను రాజకీయ కవి (Political Poet) అనొచ్చు.
రాజకీయ మంటే నిత్యం ఎదురయ్యే ఓట్ల రాజకీయాలు కాదు. రాజ్యాంగం పరిధి దాటిన అమానవీయ అంశాలను రాజకీయ కంఠంతో ప్రశ్నించడం. ఇదొక ప్రత్యేక స్పృహ.
ఇక తొణకని వాక్యం కవితా సంపుటి విషయానికొస్తే ఇతని కవిత్వ జీవితంలో ఇదొక మలుపు. ఈ పేరే కవి గడుసుతనానికి ఒక ప్రతీక.
చరిత్రలో ఎవరు నిలుస్తరు..చెరగని అక్షరంలా!
జీవితాన్ని ఎవరు మోస్తరు..తొణకని వాక్యంలా.. అంటూ మొదలౌతుంది. తొణకని వాక్యమంటే తొణకని భావమని. తొణకని దృక్కోణమని. తొణకని ప్రయాణమని. నిత్యం అక్షరాల బరువుమోస్తున్నా బ్యాలెన్స్ తప్పని నడక అని. బాధను లోపల దాచుకొని ఇతరులకు నిబ్బరాన్నిచ్చే చైతన్యమని. ఇలా గర్భితమైన వాక్యమిది.ఈ వాక్యం పొర పాటున చిందిం ది కాదు. ఉద్వేగంతో పొంగిపొర్లి నిలదొక్కుకున్న కావ్యం. అందుకే...
చిత్తశుద్ధి త్యాగనిరతి
ఏకవాక్యం కానిదే
జీవన కావ్యం
రసాత్మకమెలా అవుతది! అని తన కవిత్వం మ్యానిఫెస్టోను గొణుక్కుంటా డు. తొణకక పోవడమంటే ఇతని దృష్టి లో మనిషి నిటారుగా నిలబడటమే. కోట్ల ఈ కవితల్లో ఇది వరకు కనపడని పరిణతిని సాధించాడు.
తొణకని వాక్యం కవితా సంపుటి లో 80 కవితలున్నాయి. ఇవన్నీ అపారమైన వస్తు వైవిధ్యానికి తార్కాణంగా వున్నాయి. డోర్‌మ్యాట్ లాంటి నిత్యజీవితంలో కనపడే ఎవరిదృష్టి పడని వస్తువులు ఆయన కవితా వస్తువులైనాయి.
నేను ఉద్వేగానికి గురైనప్పుడల్లా
దీన్ని స్వచ్ఛ భారత్
అంబాసీడర్ను చేయాలనిపిస్తది..

పారిస్‌లో పేలిన బాంబు, ఇక్కడి పాదయాత్ర లాంటి న్యూస్ పేపర్ సంఘటనలు, డిమానిటైజేషన్ పర్యవసానంగా వాటిల్లిన నోట్ల తలపోతలు. స్త్రీ, పురుష సంబంధాల గురించి కోట్లకు శుభ్ర, సుందరమైన అభిప్రాయాలున్నాయి పెళ్ళాం ఊరేళ్తే, అవును! మా ఆమెనే లాంటి పదారు కవితలు స్త్రీ పట్ల అతనికి గల గౌరవాన్నీ, అనురాగాన్నీ తెలియజేస్తాయి. అన్నట్టు కోట్ల సతీమణి వనజాత కూడా చక్కటి కథా రచయిత్రి.
ఇక ఈ సంపుటిలో కవిత్వాన్ని గురించిన కవితలు ఐదారున్నాయి. వీటిలో కవి సాహితీ దృక్కోణాలు తళుక్కున మెరుస్తాయి.
పాకానికైనా, కవితా పాదానికైనా, ఒక వెంటాడే తనముండాలి.
నేను కవిని
రాజ్యం పరాయిదైతే
కూల్చడమూ ఎరుకే..
కవి నిత్యం కాలగామి
నిద్రే ఒకింత లేమి
కవి ఏకవచనం కాదు
కవికి కూడా నిజాయితీ లేకపోతే
కాలం నిద్రపోతది..
ఇట్లా వస్తు వైవిధ్యం వల్లా, కవిత్వంలోని పలుకొణాల దర్శనం వల్లా కోట్ల సమగ్ర కవిగా అవతరించాడు అనడంలో సందేహం లేదు. దానకి ఈ సంపుటి ఒక తిరుగు లేని నిదర్శనం.
తొణకని వాక్యాన్ని ప్రముఖ కవి, అనువాదకుడు జలజం సత్యనారాయణ గారికి అంకితం చెయడం బంగారానికి తావి అబ్బినట్టు. చివరగా ఒక మాట.. కవికి సద్యః ప్రతిస్పందన మంచిదే కాని సద్యో రచన ప్రమాదానికి దారి తీయవచ్చు. కోట్ల ఆ ప్రమాదానికి గురి కానందుకు అభినందనలు. wor -ds worth చెప్పిన recollection in tranquility అనేది కవిత్వం ఆగమై పోకుండా రక్షిస్తుంది. అన్నట్లు కోట్ల కవిత్వం లో తెలంగాణ పదాలు పాయసంలో యాలక్ పలుకుల్లా హాయిగా ఉంటాయి.
- ఎన్.గోపి

gopi

వేదాల అనువాదకుడికి ఉపరాష్ట్రపతి అభినందన

నాలుగు వేదాలను సులభమైన శైలిలో తెలుగులోకి అనువదించినందుకు ప్రముఖ రచయిత శ్రీ యం.వి.నరసింహారెడ్డిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. సృష్టి ధర్మానికి, మానవ ధర్మానికి, జంతు ధర్మానికి సకల ధర్మాలకు మూలంగా మన పెద్దలు అందించిన వేదాలను అందరికి చేరువ చేయాలన్న సంకల్పం ఉన్నతమైనదంటూ ఉప రాష్ట్రపతి తన లేఖలో పేర్కొన్నారు. వేదాల్లో ఏముందని ప్రశ్నించేవారికే కాక, వేదాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి మీ తెలుగు వచనానువాదము ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. యం.వి.నర్సింహారెడ్డి వేద పరిశోధనపై రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తొలి ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. యం.వి.నరసింహారెడ్డి రామాయణం, మహాభార తం, భాగవతం,108 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలను కూడా తెలుగులోకి అనువదించారు. ఆయ న జగిత్యాలలోని కౌసల్య తెలుగు పండిత శిక్షణ కళాశాలలో గత 22 సంవత్సరాలుగా ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం ఎనలేనిదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సాహిత్యరంగాభివృద్ధి కోసం కృషి చేస్తుందని కితాబిచ్చారు.

440
Tags

More News

VIRAL NEWS