మర్రి ఆకాశం


Sun,July 29, 2018 11:26 PM

Thimmamma-marrimanu
ఉలిక్కి పడ్డనో
ఊరు సరాన పడ్డదో
ఊయలలు ఊగుతున్నయి కంట్లో
బొడ్డు పేగులా ఏలాడుతున్న
మర్రి ఊడల తల్లి
అమ్మ వాసనలు నిండిన
పచ్చనాకుల ఆకాశం
తాతల్ని మామల్ని పెనవేసుకొని
ఊగిఊగి నాకనుపాపల మధ్య
వదలిపోయింది
నిన్న మొన్నటి వరకు
ముచ్చట పెట్టిన
మూడుతరాల మర్రి
ఒక్కసారి నా గుండెల మీనికి వొరిగింది
పెళపెళమంటు
నా ఎముకలు విరిగిన చప్పుడు
తుమిష్కల దండు
ఉడుతల ఉరుకులు
దండాలు పెడుతున్న తొండలు
తీరొక్క పిట్టల తిరనాళ్ళ
సమరుకాకుల రెక్కల కిందినించి
సాయంత్రాలు జారిపడేవి
పాటలు మొసుకుంటు
తేనెలు జారుతుంటే
పొద్దుపువ్వు మత్తుగా వాలిపోయేది
మర్రి కింద మహా మాంత్రికులం
కత్తులు కటార్లు కాంతారావులు
కొమ్మలే కోట బురుజులు
బాల్యం రొమ్ములు విరుచుకున్న
బాల వద్ది రాజులం
అది ఓ చిత్ర గోద
మరి కింద మొల్చిన తొట్టెల్లు
దస్తీ బిస్తి దాగుడుమూతలు
దాక్కున్న మర్రికింది మాయాలోకం
రుతువుల్లో తిరిగొచ్చిన పచ్చుల్లా
సెలవుల్లో గీ చెట్టుకింద చేరేవాళ్ళం
గంపంత జుట్టు పెట్టుకుని
గయ్యాలిల కనిపించే
చల్లని తల్లి
గీ వొడినించే
తాతలు మామలు
అమ్మతోడ అంతా
తరలిపోయిన్రు
కలల రగస్య దేశాలకి
పక్షిగూడు జారిపోయింది
పక్షి గింజ మిగిలిపోయింది
ఒరిగిపోయిన నీడ పట్టున
వంటరిగ మిగిలిపోయిన
నిద్ర పట్టని
నా బాల్య దూపని ఇరబోసుకొని
- మునాసు వెంకట్, 98481 58163
(నాకు ఎంతో ఇష్టమైన
నా చిన్ననాటి మర్రిచెట్టు కాలిపోయిన దుఃఖంలో..)

332
Tags

More News

VIRAL NEWS