నేను అక్కడ్నించే వచ్చాను!


Sun,July 29, 2018 11:25 PM

నేను అక్కడ్నించి వచ్చాను !
అందుకే నాకెన్నో జ్ఞాపకాలు మిగిలాయ్
అందరు మర్త్యులకులాగే నేనూ జన్మించాను
నాకూ ఓ తల్లి ఉంది
బహు కిటికీల గృహం కూడా ఉంది
నాకు సోదరులు, స్నేహితులు
శీతల గవాక్షపు జైలు గది కూడా ఉంది
సాగర పక్షులు కరుచుకెళ్లిన కెరటం నాదే
నాకంటూ ఓ చూపుంది
అదనంగా మరో గడ్డి పరక నా వెంట ఉంది
పదాల అంచుల వెంట
సుదూరాలలోని చందమామ నాదే
ఎగుర్తున్న పిట్టల సమూహాలు
నశించలేని సతత ఆలివ్ చెట్టు కూడా నాతోనే...
ఈ నేల మీద కత్తుల కవాతు కన్నా ముందే
నేను నడిచాను
దాని సజీవ సచేతన దేహాన్ని బరువైన బల్లగా మలిచాను
నేను అక్కడ్నించే వచ్చాను !
అక్కడ అమ్మకోసం శోకాలు పెడ్తున్న ఆకాశాన్ని చూశాను.
నీలాకాశాన్ని దాని తల్లికి అప్పగించాను
తిరిగొస్తున్న మేఘానికి నా ఉనికిని తెలపడం కోసం
నేను కూడా శోకాలు మొదలెట్టాను
ఇక నేను సునాయాసంగా శాసనోల్లంఘన చేయడానికి
న్యాయ స్థానంలోని చట్టాలన్నిటిని ఔపోసన పట్టాను
అంతేనా, సమస్త పదాలనూ పుక్కిట పట్టాను
సకల శాస్ర్తాలనూ ధ్వంసం చేసాను
వాటన్నిటినీ ఒకే ఒక్క పదంగా సృష్టించడం కోసం
ఆ ఒక్క పదం--
స్వదేశం !
మూలం: మహమూద్ దర్వీష్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 8008005231

305
Tags

More News

VIRAL NEWS