పాబ్లో నెరుడా


Mon,July 16, 2018 12:51 AM

(1904, జూలై 12-1973, సెప్టెంబర్ 23)

చిలీ దేశపు జాతీయ కవిగా పేరొందిన పాబ్లో నెరుడా అసలు పేరు రికార్డో ఎలీసర్ నెప్తాలీ రేయెస్ బాసోల్టో. 13 ఏండ్ల చిరుప్రాయంలోనే కవితా రచనను ప్రారంభించిన నెరుడా అధివాస్తవికం, చారిత్రకం, ప్రేమ, రాజకీయ నేపథ్యంతో కూడిన విభిన్న శైలితో కవిత్వాన్ని రాశారు. ఈ కవికి మన దేశంతో కూడా అనుబంధం ఉన్నది. 1927లో బర్మాలో చిలీ దేశ రాయబారిగా న్యూఢిల్లీలో ఉండి పనిచేశా రు. (అప్పట్లో బర్మా బ్రిటిష్ ఇండియాలో భాగం). ఇలా రాయబారిగా, రాజకీయనేతగా, సాహితీ సృజనకారుడిగా కూడా బహుముఖ పాత్ర పోషించిన నెరుడా, గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ వంటి సాహితీవేత్త ల చేత 20వ శతాబ్దపు ప్రపంచ భాషల్లోనే మేటి కవిగా కీర్తించబడినా రు. ప్రేమకు పట్టంకట్టిన కవిగా ప్రఖ్యాతిగాంచిన ఆయన, నెరుడా పేరుతో 2016లో పాబ్లో లారిన్ దర్శకత్వంలో ఓ బయోపిక్ సినిమా కూడా వచ్చింది. ఈయన రచనల్లో 100 Love Sonnets, Twenty Love Poems and a Song of Despair, Still Another Day, Book of Twilights, The Book of Questions Stoes of the Sky, Winter Garden, The Separate Rose వంటి రచనలు ప్రముఖమైనవి.
NERUDA

ఈ రాత్రి నేను రాస్తాను!

ఈ రాత్రి నేను రాస్తాను
అత్యంత దుఃఖభరిత వాక్యాలను.
చెప్పాలంటే,
ఈ రాత్రి నక్షత్రాలతో తళుకుతోంది
నక్షత్రాలేమో నీలంగా నవ్వుతున్నాయి
దూరాన ఎక్కడ్నించో చిన్న వణుకు
రాత్రి పవనం
ఆకాశంలో గిర్రున తిరిగి పాటందుకుంటుంది
ఈ రాత్రి నేను అత్యంత విషాద గీతాన్ని రాస్తాను
నేను ఆమెను ప్రేమించాను
కొన్నిసార్లు ఆమె కూడా నన్ను ప్రేమించింది
ఇలాంటి రాత్రులలో ఒకానొక సారి
నేను ఆమెను నా బాహువుల్లో బంధించాను
అనంతాకాశ ఛత్రం దిగువన
ఆమెను పదేపదే ముద్దులాడాను
ఆమె నన్ను ప్రేమించింది. కొన్నిసార్లు నేను కూడా.
ఆమెవి అద్భుత ప్రశాంత నయనాలు
ఇక ప్రేమించకుండా ఎవరుంటారు?
ఈ రాత్రి నేను అత్యంత శోక వాక్యాలను రాస్తాను
నాతో ఆమె లేదనుకుని
నేను ఆమెను పోగొట్టుకున్నాననుకొని.
ఈ మహా రాత్రిని
ఆమె లేని ఈ బృహత్ రాత్రిని వినడానికి
పచ్చిక బయలు మీద మంచు బిందువు లాగా
వచనం హృదయం మీద వాలుతుంది
నా ప్రేమ ఆమెను ఆపలేకపోయాక
ఇక ఏమైతే నాకేంటి?
ఆమె నా పక్కన లేకపోయాక
నక్షత్రాల రాత్రి జిలుగులెన్ని ఉంటే ఏంటి?
ఇది ఇంతే!
దూర సుదూరాలలో ఎవరో పాట పాడుతున్నారు
నా ఆత్మ ఆమెను కోల్పోయిన నైరాశ్యంలో ఉంది
నా చూపు ఆమెను వెదుకుతూ
ఆమెను నా దరికి తీసుకు రావాలనే వెర్రి ప్రయాసలో..
నా మనసు ఆమెను అందుకునే తీక్షణ వీక్షణలో...
అదే రాత్రి,
వృక్షాలకు వెలుతురు వర్ణాన్ని పులిమింది
వెలుగొచ్చాక మనం ఎప్పట్లా ఉండలేం కదా
ఇది నిశ్చయం,
గతంలో ఆమెను ఇష్టపడినంతగా
ఇప్పుడు ఆమెను ప్రేమించలేను
ఆమెను స్పృశించాలని చూసిన గాలి తరంగం
ప్రయత్నించి భంగ పడ్డ నా స్వరం
ఇప్పుడిక ఆమె ఇతరులది.
అవును, ఆమె వేరొకరిది
నేను చుంబించడానికి ముందరి క్షణం లాగా
ఆమె స్వరం, మెరుపులీనే దేహం, అనంత నయనాలు, అన్నీ!
అది ఖచ్చితం.
ఇక ఏ మాత్రం ఆమెను నేను ఇష్ట పడలేను
కానీ ఆమెను ప్రేమిస్తూనే ఉంటానేమో
ప్రేమ తాత్కాలికం. విస్మరణం అత్యంత సుదీర్ఘం .
ఎందుకంటె,
ఇలాంటి ఒకానొక రాత్రి
ఆమెను నేను నా కౌగిలిలోకి తీసుకున్నాను
ఇప్పుడా శూన్యం
నా ఆత్మను అలజడిలోకి తోసేసింది
ఆమె నాకు చేసే గాయాలలో
ఇదే చివరి బాధ అని తెలుసు
అయినా, నేను ఆమె కోసం రాస్తాను
ఈ వాక్యాలను... నా ఆఖరి వాక్యాలను...!

471
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles