పాదముద్రలూ పద సముద్రాలూ


Mon,July 16, 2018 12:48 AM

MUDRALU
నడిచివచ్చిన దారి
మైలురాయి గొంతెత్తి
పాదాలతో బాట పంచుకుంటది
దాటి వచ్చిన మజిలీ గుండెకు చిక్కువడ్డ పోగై
తలపుల తలుపు తడుతుంటది
ఆరారుగాలాలూ ఋతువులతో
తలంటుకుంటున్న దారిమాత్రం
గమ్యం చేర్చిన తృప్తితో
గండాలకెదురీదుతుంటది
దారివేసిన వాడు దాత
చిక్కుకంపల నడుమ
ఎటమటమౌతున్న కాళ్ళకు కళ్ళిచ్చి
నడవడమొక దీక్షగా
నడకే బతికున్న సాక్ష్యంగా
కదిలించిన వాళ్ళు దారి ఊపిరి ఆనవాళ్ళు.
ఇరుపక్కలా చెట్లు నాటిన వానికంటే
చట్టై చెయిసాచి నీడపట్టిన వాళ్ళు
ఆకుపచ్చ కందిలీలు.
శాలువా కప్పి
తనపేరు చెక్కుకున్న కీర్తి ఆకలితో
దారికి నిమిత్తం లేదు.
రాగంలేని యోగి దారి
అలంకారాలకతీతమైన విరాగి దారి.
దేహాన్ని పాదముద్రల పరవశ యాత్రగా
పరిణత పదసముద్రాల హోరుగా ధరించి
తడుస్తున్న తపోభూమి దారి.
అడుగుల కోసం అక్షరాల తీరం దాకా
పరుచుకున్న అలుపెరుగని పలక
కాలాన్ని తీర్చిదిద్దుకునే
నెనరైన వాహిక.
మేఘాల గాత్ర కచ్చేరీకి
రసరమ్య వేదిక.
చలిగాలుల్నీ వేసంగి వేదనలనూ
ఒడిసిపట్టి ఓదార్చే అమ్మ ఒడి.
అనంతకాలాల శ్వేతపత్రం మీద
ఆత్మవిశ్వాసపు చేవ్రాలు.
శతానీక వసంతాలు దాటినా
వసివాడకుండా చూసుకోవలసిన
మన వెలుగు పూల బగీచా
వెన్నెల రేల ముషాయిరా..
- వఝల శివకుమార్, 9441883210

534
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles