ఎడబాటు


Sun,July 8, 2018 10:54 PM

Edabaatu
ఒంటరి పక్షిని
గూడు కూడా భయపెడ్తది
పొద్దు గూకినా
జంట పక్షి రాదని తెలిసి
పాదానికి పొసగని పొడగాటి చెప్పయి
గూడు అసౌకర్యాన్ని రగిలిస్తది!
రాత్రంతా
శరీరమొక్కటే గూట్లో
బిక్కు బిక్కుమంటూ ముడుచుకుంటుంటే
ఆత్మ తప్పిపోయిన గొర్రె పిల్లయి
అన్నిదిక్కులూ ప్రవహిస్తూ
సహచరి కోసం గాలింపు మొదలెడ్తది
చివరికి వెతికి పట్టుకున్నానన్నా
శరీరం ఆధారాల కోసం డిమాండ్ చేస్తది
ఎద చీల్చి చూపడానికి
నేనేమన్నా హనుమంతున్నా?
ఆమెలో ఏనాడో కరిగిపోయిన అదృశ్యరూపాన్ని
చూపటానికి అన్ని అనుభూతులు
ప్రదర్శనకు నిలువవు!
ఒంటరి పక్షికి మాత్రమే తెలుసు
అగ్ని సాక్షిగా నడిచిన పాదాలు
తన చుట్టే తిరుగుతున్నాయని!
భావ కవిత్వానికివి రోజులు కావు గాని
బంధాలను ఎడబాటు
మరింత చిక్కబరుస్తూనే ఉంది!!
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261

217
Tags

More News

VIRAL NEWS