మ్యాన్ మేడ్ మిరాకిల్


Sun,July 8, 2018 10:50 PM

నీళ్లు లేని తనం
నెత్తి మీద నీడ లేని కాలం
ఊళ్ళను బీళ్ళను చేసిన పాలన
తల్లి పిల్లలను ఎడబాపిన కాలం
ఏ విత్తనమైనా మొలకెత్తేది తడితోనే
ఏ నాగరికతైనా
నిలబడేది నీటి దగ్గరనే
ఏ ఆశయాలైనా
వికసించేది నీళ్ళుంటేనే
తడారిన తటాకాలు,
బావుల కడుపుల్ని నింప
వాయు వేగమై వస్తున్న కాళేశ్వరం
కరువుతో కృశించిపోతున్న దేహాలకు
కాళేశ్వరం ప్రాజెక్టు జల ఔషధం
జానెడు నేలకు చారెడు నీళ్లే ఆస్తి
కాళేశ్వరం చరిత్రలో నిలిచే వేగుచుక్క
వాకిట్ల ఈత చాపలో
రాత్రి నక్షత్రాల బతుకు లెక్కలు
పొద్దున మనసంతా పొగచూరిన పొరుకాసు
చిలుములంటు పెట్టిన చేతులకు బొగ్గలు
మొగులు కదలదు మేఘం కనికరించదు
కురిసినా.. సముద్రం పాలు
ఏ ఆకాంక్షలకై
ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందో
ఏ ఆశయాలకై
వీరులు అమరులయ్యారో
ఆ త్యాగాల తోవలే...!
నీళ్ళు, నిధులు, నియామకాలు..
మన నీళ్ళను మనం నిలబెట్టుకునే స్వప్నం
కోటి ఎకరాల మాగాణం
బతుకమ్మ సిగలో రంగు రంగుల పూలు
గోదారమ్మ ఎదమీద సుందిళ్ళ, అన్నారం
మేడిగడ్డ, ఎల్లంపల్లి, తుపాకుల గూడెం
బ్యారేజ్‌లు, రిజర్వాయర్లు,
పంప్‌హౌజ్‌లతో నది పునరుజ్జీవం
కాపురాజయ్యలు
జల సింగిడిని గీస్తున్నట్లు
కాళేశ్వరాన్ని జలేశ్వరంగా
పోత పోస్తున్న
ఇంజనీర్లు, కార్మికులు, టెక్నీషియన్లు,
మానవ యంత్రాలు
భూ సొరంగ మార్గాన
కార్మికులు చీమల బారులై
ఊహలకందని మహాద్భుత నిర్మాణం
ఊర్లన్ని కాళేశ్వరం.. తోవలన్ని కాళేశ్వరం
రచయితలు, కవులు, కలాలన్ని కాళేశ్వరం
అనుమతులన్నీ తంగేడు పూలై
దశకంఠుల శాపాలన్ని గండదీపాలై
దేశ దేశాల ప్రాజెక్టుల రికార్డులు బ్రేక్
గడువులు అధిగమించి గనుమల్ల
గోదావరి చెరువులు, వాగులు,
కుంటలు, బావుల ఎదురు చూపులు
చెట్టు పుట్ట గట్టు నట్టు భూమి సమస్తం
కాళేశ్వరానికి హృదయ స్వాగతాలు
నది / నీళ్ళివ్వడం పాత మాట
నదికే నీళ్ళివ్వడం తెలంగాణ కొత్త మాట
నది పొడవు నిల్వ నీళ్ళు నది సజీవం
మ్యాన్ మేడ్ వరల్డ్ మిరాకిల్
పరివాహక ప్రాంతమంతా జీవ వైవిధ్యం
అంతర్గత జలరవాణా, పర్యాటకం
చేపల పెంపకం, వ్యవసాయం
ఫలసాయం, వృత్తులకు జవజీవాలు
యువతకు పుష్కల ఉపాధులు
గ్రామాలు స్వయం పోషకాలు
ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసాలు
ఇంటి ముందల యాపచెట్టు కింద
నవారు మంచం మీద పడుకొని చూస్తే
నక్షత్రాలు కనిపిస్తయి
ఇప్పుడు
గోదావరి నీళ్ళే నక్షత్రాలు
చల్లదనం ఎ.సి.ల నుండి రాదు
పంట పొలాల పైర గాలుల నుంచి వస్తుంది
కాళేశ్వరం అందరికి కనువిప్పు
కావాలి అందరికి విముక్తేశ్వరం
కాళేశ్వరం మహా జలేశ్వరం
కావాలి అందరికి తీర్థయాత్ర
- వనపట్ల సుబ్బయ్య, 94927 65358

441
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles