ఉషస్సు


Mon,June 25, 2018 01:44 AM

Suryodayam
ఈ సుందర మనోహర ఉషోదయం
ఆహ్లాదకర కాంతిని విరజిమ్ముతూ
నవ వధువు కొంగుచాటు నుండి తొంగిచూస్తున్నట్లు
చిరునవ్వుతో పలకరిస్తున్నది
గత స్మృతులను మృదువుగా తరిమేస్తూ
అత్తవారింట్లో హుషారుగా తిరుగుతున్న
కొత్త కోడలులా పులకిస్తున్నది
పక్షుల మధురగీతికా కలకలధ్వని కోలాహలం
సూర్యకిరణాల కాంతి పుంజాల
సరిహద్దు రేఖాచిత్రం!
కన్నెపిల్ల కాలి అందియల రవళి వలె
ధ్వనిస్తున్న సుందరమైన సరసమైన ఉషోదయం
ఏమిటో విచిత్ర సుందర దృశ్యం
ఇది నా జీవన భ్రాంతి కాదుకదా!
నేనింకా నిద్రావస్థలోనే ఉన్నానా?
ఇది నా ఆలోచనల ప్రతిరూపమా?
నా కల్పనల ప్రతిస్పందనా?
ఇంతకీ ఇదొక స్వప్నం కాదుకదా?!
మిత్రులారా..!
మునుపెన్నడూ మా వీధిలో
ఇంతటి అందమైన మనోజ్ఞమైన ఉషోదయం
అగుపించలేదు
ఇప్పుడు నేనేమైనా తాగిన మైకంలో స్పృహను
కోల్పోయానా? అన్న సందేహం కలుగుతున్నది
ఎందుకంటే...
ఆక్రందిస్తున్న విలపిస్తున్న బాల్యం
నాకు పక్షుల కలకలా రావ కోలాహలంలా
వినబడుతున్నది
యవ్వనపు మౌనరోదన
కన్నెపిల్ల కాలి అందియల రవళిలా ధ్వనిస్తున్నది
ఇంతకీ ఇది నే పుట్టిపెరిగిన వీధియేనా?
లేక సుదూర గగనవీధిలో
చందమామ ఒడిలో కూచుని
నేనొక కాల్పనిక ఉషోదయాన్ని చిత్రిస్తున్నానా?
ఎందుకంటే...
మునుపెన్నడూ మా వీధిలో
ఇంతటి మనోహర సుందర ఉషోదయాన్ని
నే చూడలేదు..
ఇంతటి అందమైన మనోజ్ఞమైన ఉషస్సును
నే వీక్షించలేదు...
డోగ్రీ మూలం: అభిశాప్
తెలుగు అనువాదం: డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ

405
Tags

More News

VIRAL NEWS