నెత్తావి జీవితం


Mon,June 25, 2018 01:42 AM

మనసారా నవ్వే పువ్వును
చూసావా నువ్వెప్పుడైనా?
అయినా నా పిచ్చి గానీ
పువ్వుకు నవ్వడం తప్ప-
నవ్వినప్పుడల్లా ఇన్ని నిండైన పరిమళాల్ని
పరిసరాల్లో సంధించి
పదుగురికీ పంచడం తప్ప-
ఇంకేం విద్య తెలుసని?
పువ్వుల అమ్ముల పొది నిండా
నెత్తావి నవ్వుల శరములే!
నిష్కల్మషం, నిస్స్వార్థం, నిర్వికారం
నిరుపమాన నిరహంకార నిర్మలత్వం
పువ్వును చూసైనా నేర్చుకోలేమా మనం?
స్వార్థం, కుళ్ళు, కుత్సితం,
కుతంత్రం, కుటిలత్వం
ఒళ్ళంతా నింపుకున్న మనిషి
ఒక్క పువ్వును నిశితంగా పరికిస్తే.
పరిశీలిస్తే.
ఎన్ని జీవన సత్యాలను తెలుసుకోవచ్చని!
గుడి, బడి, ఒడి, బ్రహ్మ ముడి-
ప్రతీ సందర్భంలో-
ఇవ్వడమే గానీ తీసుకోవడం తెలియని
జీవన మర్మం తెలిసిన-
మనిషితనం నిండారా నింపుకున్న పువ్వు-
కనుమరుగై పోతున్న మనిషి లోనికి
ఇన్ని ప్రేమ సుగంధాల్నీ,
ఇంత సున్నితత్వాన్నీ, ఇంత మంచితనాన్నీ,
ఇంత మనిషితనాన్నీ
ఒంపితే ఎంత బావుండు!?
- డాక్టర్ వాణీ దేవులపల్లి 9866962414

219
Tags

More News

VIRAL NEWS