ఆ చెట్టు


Mon,June 18, 2018 01:24 AM

Aa-chettu
అది పండిన చెట్టే.. కాఠిన్యులు విసిరిన కరకు రాళ్ల
దెబ్బలకు పచ్చి పుండయ్యింది
సారవంతమైన మాగాణమేయైనా
సంక్షుభితంగానే ఎదిగిన
వృక్షరాజం..
దశాబ్దాల పాటు
వలస పక్షుల దాడితో
దగాపడిన వైనమే
వేరు పురుగుల చేరికతో
చెట్టు ఉనికికే ముప్పు వాటిల్లిన
దయనీయం
వంచకుల మచ్ఛికలో
నివురు గప్పిన నిప్పులా
నిశ్చేష్టితయ్యింది
ఇన్నాళ్లు ఆ చెట్టుకు అతుక్కున్న వలస వాదులు
ఇసుంట రమ్మంటే ఇల్లంతా
నాదేననిరి
చెట్టు ఫలాలన్నీ
వలసవాదులే కాజేస్తుంటే
పట్టాదారుకు మిగిలింది
ఖాళీ భోషాణమే!
కొమ్మలను నరికినా
ఆశల రెమ్మలను హరించినా
పండ్లను దోచుకున్నా
కడగండ్లను మిగిల్చినా
ఓరిమితో సహించారు
ఇన్నాళ్లు చెట్టు యజమానులు
చెట్టు మొదలునే తుద ముట్టిస్తుంటే..
వేరు నరాన్నే లాగేస్తుంటే
ఉగ్రరూపులై ఉద్యమించగా
పత్తాలేకుండా పరారయ్యారు
ముష్కర మూకలు
ఇపుడు ఆ చెట్టు తన కాళ్లమీద నిలబడి
నాలుగు వత్సరాలయ్యింది
కాయ చికిత్స చేసుకుంటూ
కకావికలమైన స్థితిగతులను
క్రమపరుచుకుంటున్న
కార్యసాధక వృక్షం..
అభివృద్ధి పథాన అడుగులేస్తూ
అద్భుత ఆవిష్కరణలకు అడ్రస్సయింది
నూతన భావాల ఫలాలను
ప్రపంచానికి అందిస్తున్న మహోన్నత వృక్షం
చెట్టునీడన జీవించే సబ్బండ వర్గాలు
హరితవర్ణ శోభితులవుతున్నతున్న దృశ్యం..!
ఆ చెట్టే.. మన తెలంగాణం
మనందరి హృదయ నినాదం
మరింతగా పరిఢవిల్లాలి
మూడు పువ్వులు
ఆరు కాయలుగా కలకాలం...
- బాదేపల్లి వెంకటయ్య గౌడ్
99485 08939

747
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles