నీటి పువ్వు


Mon,June 18, 2018 01:23 AM

Neeti-puvvu
నది అంటే నడుస్తున్న సంపద
నీటిని మూట గట్టి
పొలాల్లో విప్పితే
అది సీతాకోక చిలుకల గుంపవుతుంది!
నది అంటే నడుస్తున్న చరిత్ర
ఆ చరిత్రను రైతుల దోసిట్లోకి ఒంపుతే
నేలంతా రంగుల పూవులై
తేనె మరకల సంతకమవుతుంది!
నది అంటే సాంస్కృతిక కళారూపం
నది పారుతున్న శబ్దం
సంస్కృతిలో సంస్కారంలో కలిసిపోతే
అది మన నాగలి మీద భరోసా భావమవుతుంది!
నది ఒకప్పుడు మనకు ఎండమావి
ఇప్పుడు మేడిగడ్డ నుంచి కన్నెపల్లి మీదుగా
తరలివస్తున్న పాల పొంగు
ఇంటి ముంగటి గోదారికి ప్రాణం పోస్తున్న
అలుపెరుగని శ్రామిక లోకం
ఎండిన పొదుగైన పొలాలల్ల
అమృత ధారలవుతున్న పాలకుల వ్యూహం
కరువు పాటలకు కాలం చెల్లిందంటున్న
ఉద్యోగుల అవిశ్రాంత శ్రమ
నది ఒకప్పుడు చుట్టపు చూపు
ఇవ్వాళ ఒట్టిపోయిన చెరువుల్లో
జలసిరులు కురిపించే ప్రజల కలల నీటి పువ్వు
మన గోలెంల ఎగురుతున్న చేపల గుంపు
మనల్ని కమ్ముకుంటున్న వెన్నెల గాలి
ఇప్పుడు నన్ను ఆలింగనం చేసుకుంటున్న ప్రేమ జల
నా మట్టిలో మళ్ళీ ఉట్టిని నింపిన నిత్య యవ్వన ధార..
- ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, 98490 82693
( కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సమయాన)

563
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles